ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పుగోదావరి) : కాల్దారి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి చిన్నపాటి వర్షానికే మోకాలి లోతు నీరు నిలువ ఉండిపోవడంతో అవతలికి చేరుకోవడమెలా అంటూ ఇరువైపులా వాహన పదారులు, ప్రయాణికులు, స్థానికులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే శాఖ డబలింగ్, ఆధునీకరణలో భాగంగా ప్రయాణికులకు రైలు గేటు అడ్డంకి లేకుండా కాల్దారిలో ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ప్రయాణికులను అవస్థలకు గురిచేస్తుంది. వర్షం వస్తే కాలి నడకన వెళ్లే వారికి వాహనదారులకు తిప్పలు తప్పవంటున్నారు స్థానికులు. ఓవైపు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి పరిస్థితి ఇలా ఉండగా, కాల్దారి గ్రామం నుండి బ్రిడ్జి వైపుకు చేరుకునే ప్రధాన రహదారి భారీ గుంతలు పడి, ప్రయాణానికి ఏమాత్రం అనుకూలంగా లేక, తరచు వాహనాలు గుంతలలో పడిపోవటం, చిన్నపాటి ప్రమాదాలకు గురికావడం వంటివి జరుగుతున్నాయని వాపోతున్నారు. ఈ విషయమై పలుమార్లు సంబంధిత అధికారులకు విజ్ఞప్తులు చేసినప్పటికీ, పరిస్థితి మెరుగుపరచడం లేదని ఉండ్రాజవరం మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు షాజహాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సంబంధిత అధికారులు మాట్లాడుతూ మానవ రహిత, ఆటోమేటిక్ మోటార్ పంపును ఏర్పాటు చేసినట్లు, ఇకపై బ్రిడ్జి అవస్థలు ఉండవని తెలిపినప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. సంబంధిత అధికారులు స్పందించి, ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా రోడ్డు, బ్రిడ్జిలను మెరుగుపరచాలని కాల్దారి వాసులు మీసవరపు స్వామి, గడ్డం రాకేష్, కొవ్వాడ అప్పారావు, వేలివెన్ను వాసులు పెన్నాడ నటరాజ్ తదితరులు కోరుకుంటున్నారు.











