ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : నానాటికీ మానవత్వ విలువలు మంట కలిసిపోతున్నాయి. తన, తమ, ధనిక, పేద, ముసలి తేడా లేకుండా అవసరం లేదనుకుంటే అంతే రోడ్ల మీదకు నెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు. దీంతో అందరూ వున్నా అనాధలుగా మిగిలిపోతున్నారు కొందరు. అలాంటివారికి ఆసరాగా నిలుస్తూ మానవత్వం చాటుతున్నారు మరికొందరు. అలాంటి సంఘటనే ఇది. ఆమెది సుమారు ఎనిమిది పదుల వయస్సు, వృద్ధాప్యంతో పాటుగా అనారోగ్యం సంభవించి, అవిటిదయ్యింది. కనీసం తన పనులు కూడా తాను చేసుకోలేని దయనీయ స్థితిలో రోడ్డు పాలయ్యింది, కాదు... కాదు.. సొంతవాళ్లే రోడ్డుమీద వదిలేశారు. స్థానికులు ఆమెకు అండగా నిలిచి సపర్యలు చేస్తున్నారు. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు మండలంలోని దామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆరిపాక సత్యవతి గత రెండేళ్ల క్రితం వరకూ గ్రామంలో తనకు గల నివాసంలో వుంటూ, తన పనులు తాను చేసుకుంటూ పింఛను, రేషన్ ద్వారా జీవనోపాధిపొందుతూ జీవించేది. ఈమె కుమారుడు గత కొన్నేళ్ల క్రిందటే కుటుంబంతో సహా రాజమహేంద్రవరం వలస వెళ్లి పోయాడు. రెండేళ్ల క్రితం తనతల్లి సత్యవతిని కుమారుడు కుటుంబీకులు రాజమహేంద్రవరం తమవద్దకు తీసుకువెళ్లారు. అనంతరం గ్రామంలో గల ఇంటిని అమ్మేసారు, పింఛను, రేషన్ కార్డు లను రాజమహేంద్రవరంకు బదలాయించుకున్నారు. ఏమయ్యిందో ఏమో గానీ గత నాలుగురోజుల క్రితం వృద్దురాలైన సత్యవతిని కుమారుడి కుటుంబీకులు దామిరెడ్డిపల్లి తీసుకువచ్చి, ఒక గుడివద్ద నిర్ధాక్షణ్యంగా వదిలి వెళ్లిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈమెకు గ్రామంలో బంధుగణం ఉన్నప్పటికీ, ఎవరూ కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్దలు కలుగచేసుకుని వృద్దురాలైన సత్యవతిని సొంతవాళ్ల దగ్గరకు చేర్చే ఏర్పాట్లు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.










