ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : విద్యుత్ ప్రమాదాల నివారణే లక్ష్యంగా భద్రతే ప్రామాణికంగా రామచంద్రపురం డివిజన్ పరిధిలో విద్యుత్ మరమ్మతు పనులు చేస్తున్నామని విద్యుత్ శాఖ రామచంద్రపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాట్ల శ్రీధర వర్మ అన్నారు. మంగళవారం శ్రీధరవర్మ మాట్లాడుతూ ... మండపేట పట్టణ పరిధిలోని ఏడిద రోడ్డులో ఆరు కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్ల మార్పు, ఆలమూరు సబ్ డివిజన్ పరిధిలోని మడికి, రామచంద్రపురం పట్టణం, మండపేట మండలంలోని ఏడిద, వెలగతోడు, ద్వారపూడి తదితర ప్రాంతాల్లో లైన్ ల మార్పుతో పాటు విద్యుత్ స్తంభాలు రీప్లేస్మెంట్, జంక్షన్ లలో విద్యుత్ వైర్లు హైట్, జాయింట్స్ లేకుండా చేయడం వంటి తదితర మరమ్మతు పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఎక్కడెక్కడ మరమ్మతులు చేపట్టాల్సింది ఉద్యోగులు ద్వారా సర్వే చేయించామని అనంతరం పనులు చేస్తున్నామన్నారు. పనులు జరిగే ప్రాంతాల్లో విద్యుత్ వినియోగదారులు తమ ఉద్యోగులకు సహకరించాలని కోరారు. విద్యుత్ ఆధారిత పనులు చేస్తున్నప్పుడు ప్రమాదాలు సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వినియోగదారులు బిల్లు ఇచ్చిన 15 రోజలోపు నగదు చెల్లించినట్లయితే ఎలాంటి సర్ చార్జీలు ఉండవన్నారు. ఎస్సీ, ఎస్టీ కులస్తులకు 200 లోపు యూనిట్లు, బార్బర్ షాపులకు వంద యూనిట్లలోపు వాడకం ఉచితమన్నారు. వారు ముందుగా ఆధార్, కులధ్రువీకరణ పత్రాలతో నమోదు చేసుకోవాలన్నారు. జగనన్న కాలనీలలోని వినియోగదారులకు విద్యుత్ కనెక్షన్ ఉచితంగా అందిస్తున్నామన్నారు.










