ప్రజాశక్తి - ఉండ్రాజవరం(తూర్పుగోదావరి) : మండలంలోని దమ్మెన్ను గ్రామ పంచాయతీ 9వ వార్డుకు శనివారం జరిగిన ఉప ఎన్నికలో మట్టపర్తి అచ్యుత రామన్న విజేతగా నిలిచినట్లు రిటర్నింగ్ అధికారిణి కే సరోజిని ప్రకటించారు. ఈ సందర్భంగా విజేత అచ్యుత రామన్న మాట్లాడుతూ.. తన గెలుపునకు సహకరించిన నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, ఉండ్రాజవరం మండలం టిడిపి అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణలకు రుణపడి ఉంటానన్నారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన వార్డు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. వార్డులో మొత్తం 135 ఓట్లకు గాను పోలైన ఓట్లు 115 కాగా, కొడవటి వీరబాబుకు 43, అచ్యుత రామన్న 70 ఓట్లు సాధించగా, చెల్లని ఓట్లు రెండని, 27 ఓట్ల మెజారిటీతో రామన్న విజయం సాధించినట్లు ఆర్వో తెలిపారు. విజేతకు ఆర్వో ధృవీకరణ పత్రం జారీ చేశారు.










