వర్షాలు వచ్చేలోగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి : ఎమ్మెల్యే జి శ్రీనివాస్
ప్రజాశక్తి - ఉండ్రాజవరం(తూర్పుగోదావరి) : అధిక సంఖ్యలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ఫౌండేషన్ పూర్తి చేసుకుంటే వెనువెంటనే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు తెలిపారు. గురువారం మండలంలోని పాలంగి గ్రామంలో జగనన్న కాలనీని సందర్శించి, లబ్ధిదారులు ఇళ్ళు నిర్మించుకునేలా కల్పిస్తున్న మౌలిక వసతులను ఆయన పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారులకు అనుకూలంగా జగనన్న కాలనీ లేఔట్‌ను మట్టితో మెరక చేయించి, వారికి కేటాయించిన స్థలాలకు నెంబరింగ్ వేయించి అప్పగించడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం తరపున మంజారయ్యే నిర్మాణ సామాగ్రి అందించేందుకు అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వర్షాలు వచ్చేలోగా తప్పనిసరిగా ఫౌండేషన్ పని పూర్తి చేసుకుంటే ఇంటి నిర్మాణానికి ఆటంకం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, వైఎస్‌ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, ఎంపీడీవో, తహశీల్దార్, హౌసింగ్ ఏ ఈ, విద్యుత్ శాఖ అధికారులు, ఈఓపిఆర్డి, టెక్నికల్ అసిస్టెంట్, సచివాలయం కన్వీనర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.










