ప్రజాశక్తి -గోకవరం(తూర్పుగోదావరి) : రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్లను బాగు చేసే వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేపట్టే అర్హత లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు. మంగళవారం మండలంలోని జగన్నాధపురం నుండి సూదికొండ వరకు ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన నిధులు ఖర్చుపెట్టి రోడ్లు వేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని రోడ్లకు ఇరువైపులను నీడ నిచ్చే చెట్లు నరికివేసి సొమ్ములు చేసుకున్నారని ఆరోపించారు. పెద్దాపురం నుండి కాట్రావులపల్లి వరకు మల్లిసాల నుండి గోకవరం వరకు 14 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసి 8 కోట్ల రూపాయలు పనులు పూర్తి చేస్తే నాలుగు కోట్ల రూపాయలు కాంట్రాక్టరికి బిల్లులు చెల్లించిన కారణంగా పనులు ఆగిపోయాయి అన్నారు. నిధులు ఉండి ఖర్చు పెట్టే రోడ్లు వేయకుండా అధ్వానంగా తయారు చేసినందుకు నిరసన తెలిపారు. రోడ్లపై ఒక కట్ట మట్టి వేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. ఈ ముఖ్యమంత్రి బస్సు యాత్ర చేస్తాను అని ప్రకటించడం విడ్డూరంగా ఉందని రాష్ట్రంలో ప్రజల రోడ్లు బాగోక అవస్థ పడుతుంటే ఈన్నాళ్ళు గాల్లో తిరిగిన ముఖ్యమంత్రి ఎన్నికలు వస్తున్న సందర్భంలో ప్రజలపై కపట ప్రేమ వలక పోస్తూ బస్సు యాత్ర చేస్తానని చెప్పడం విడ్డురంగా ఉందన్నారు.వెంటనే రోడ్లు ప్యాచ్ వర్క్ చేసి రోడ్లు పూర్తి చేయాలని లేదంటే వివిధ రూపాల్లో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, అడపా భరత్ బాబు, మంగరౌతు రామకృష్ణ, మారిశెట్టి భద్రం, కన్నబాబు, పాలూరు బోసుబాబు, ఉంగరాల గణేష్ ,పోసిన ప్రసాద్ ,గళ్ళ రాము, మండిగ గంగాధర్, విడుదల అర్జునరావు, వెంకటపతి, నన్ను రాంబాబు, మిందే నరేంద్ తదితరులు పాల్గొన్నారు.










