Sep 09,2023 12:16
  •  టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌
  • ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అరెస్టు... కోరుకొండ తరలింపు

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : మాజీ ముఖ్యమంత్రి, తమ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అరెస్టు జగన్‌ అరాచక పాలనకు పరాకాష్ట అని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు కు వ్యతిరేకంగా తిలక్‌ రోడ్డులోని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం కార్యాలయం వద్ద నిరసన తెలిపిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేసి కోరుకొండ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఎటువంటి ఆధారాలు చూపించకుండా పోలీసులు అరెస్ట్‌ చెయ్యడం వైసిపి దుర్మార్గపు పాలనకు అద్దం పడుతోందన్నారు. వైసిపి పాలనలో రెండు రకాల పాలన సాగుతోందన్నారు. అందులో ఒకటి రివర్స్‌ టెండెరింగ్‌, రెండోది రివేంజ్‌ పాలన చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యం ను పక్కన పెట్టి పరిపాలన కొనసాగిస్తుండడం దుర్మార్గం అన్నారు. చంద్రబాబు నాయుడుని ఎలాగైనా జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టు జగన్‌ కక్ష్యసాధిస్తున్నారు అని మండిపడ్డారు.

రాజమండ్రిలో అరెస్ట్‌... కోరుకొండ తరలింపు

చంద్రబాబు నాయుడి అరెస్టుకు వ్యతిరేకంగా రాజమహేంద్రవరం సిటీ టీడీపీ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, టీడీపీ నగర కార్యదర్శి కిలపర్తి శ్రీనివాస్‌ తదితరులను అరెస్టు చేసి కోరుకొండ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

పోలీసు స్టేషన్‌ ఎదుట టీడీపీ శ్రేణులు నిరసన

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను అరెస్టు చేసి కోరుకొండ పోలీస్‌ స్టేషన్‌ తరలించిన విషయాన్ని తెలియడంతో టీడీపీ శ్రేణులు భారీగా అక్కడకు చేరుకున్నారు. అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబు నాయుడు, ఆదిరెడ్డి శ్రీనివాస్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జగన్‌ అరాచక పాలన అంతం కావాలని నినాదాలు చేశారు.