సిపిఎస్ ను రద్దుచేసి ఓపిఎస్ ను పునరుద్ధరించాలి : ఏపీజిఏ జిల్లా అధ్యక్షులు పి. సుబ్బారాయుడు
ప్రజాశక్తి-మండపేట (తూర్పు గోదావరి) : సిపిఎస్ ను రద్దుచేసి ఓపిఎస్ ను పునరుద్ధరించాలని ఏపీజిఏ జిల్లా అధ్యక్షులు పి. సుబ్బారాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రభుత్వ ఉద్యోగులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ ... ప్రతినెలా ఒకటో తేదీన జీతభత్యాలు చెల్లించేలా చట్టం చేయాలని, ఉద్యోగులు దాచుకున్న సొమ్ములకు భద్రత కల్పించాలని, ఉద్యోగుల పదవి విరమణ రోజునే అన్ని ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్న తదితర డిమాండ్ల సాధన కోసం ప్రత్యేక కార్యచరణతో ప్రభుత్వంపై పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో మండపేట తాలుక అధ్యక్షులు పివి రమణ రావు, విఆర్‌ఓ సంఘం అధ్యక్షులు జి.దుర్గారావు, పెన్షనర్స్ అసోసియేషన్ సంఘ అధ్యక్షులు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.










