May 23,2023 16:19

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరులోని మండల పరిషత్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం 18 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకు, 21 సంవత్సరాలలోపు మగపిల్లలకు పెళ్లి చేయడం నేరమని తెలిపారు. ఈ పెళ్లిలో పాల్గొన్న వారికి, పెళ్లికి సహకరించిన వారందరికీ 2 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.లక్ష రిమానా ఉంటుందని హెచ్చరించారు. మనబడి, నాడు నేడు, జగనన్న అమ్మవొడి అనే పథకాల ద్వారా పిల్లలను విద్యకు ప్రోత్సహించడంలోనూ స్వేచ్ఛా స్వాతంత్య్రంలో ముందడుగు వేస్తోందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాల్యవివాహాల నిషేధంలో భాగస్వామ్యులు అవ్వాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసిహెచ్‌డిఎస్‌పిడి ఎంపీపీ హేమలత ఎంపీడీవో విజరు ప్రసాద్‌, వైస్‌ ఎంపీపీ విజరు, ఇన్చార్జ్‌ ఎమ్మార్వో వరప్రసాద్‌, డాక్టర్‌ దయాకర్‌, ఈవోఆర్‌ డి.సత్యబాబు తదితరులు పాల్గొన్నారు.