- గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సిఇఒ ఇంతియాజ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేయడమే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలు చురుగ్గా పనిచేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్య నిర్వహణాధికారి ఎఎమ్‌డి ఇంతియాజ్ పిలుపునిచ్చారు. సోమవారం స్వయం సహాయక సంఘాలు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ నిర్వహించారు. ఇందులో భాగంగా 'లైవ్‌ఓత్' కార్యక్రమం సెర్ప్ కార్యాలయంలో జరిగింది. పంచాయతీరాజ్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్, సెర్ప్ సిఇఒ ఇంతియాజ్ సభ్యులతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ.. సుమారు 90 లక్షల మంది మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండి వివిధ రకాల జీవనోపాధులు చేపట్టి ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు. సామాజిక అంశాలపై పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతినెలా తమ రెండో సమావేశంలో రక్తహీనత, బాల్య వివాహాలు, విద్య వంటి అంశాలపై అజెండా పెట్టుకుని తప్పనిసరిగా చర్చ జరగాలన్నారు.










