ప్రజాశక్తి-రాజానగరం(తూర్పుగోదావరి) : ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మేనేజ్మెంట్ ప్రొఫెసర్, ఓ.ఎస్.డిగా బాధ్యత నిర్వహిస్తున్న ఆచార్య ఎస్.టేకి(53) గుండెపోటుతో మృతి చెందారు. గురువారం ఉదయం రాజమండ్రిలోని ఆయన స్వగృహంలో అకస్మాత్తుగా గుండుపోటుతో మృతి చెందారని రిజిస్ట్రార్ ఆచార్య టి.అశోక్ తెలియజేశారు. ఆయన మరణ వార్త యావత్ నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.
ఆచార్య ఎస్.టేకి 1993 భారతీయ విద్యా భవన్ జల్గావ్‌లో, 1995 ఉత్తర మహారాష్ట్ర విశ్వవిద్యాలయం జల్గావ్‌లో లెక్చరర్‌గా వృత్తిని చేపట్టారు. 1998 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ భోపాల్‌లో రీసెర్చ్ అసోసియేట్, 2007 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఫరీదాబాద్‌లో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. 2009లో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఆచారునిగా వృత్తిని చేపట్టి ఉత్తమ ఆచార్యునిగా గుర్తింపు పొందారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా, ఈసీ మెంబర్‌గా, ప్రిన్సిపాల్‌గా, డీన్‌గా, కీలక బాధ్యతలు నిర్వహించారు. విశ్వవిద్యాలయ పరిపాలన వ్యవహారాలలో చురుగ్గా పాల్గొనేవారు. ప్రస్తుతం యూనివర్సిటీ ఓ.ఎస్.డిగా, ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆచార్య ఎస్ టేకి మరణ వార్తను విన్న యూనివర్సిటీ అధికారులు, అధ్యాపకులు, ఆధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, పూర్వ అధికారులు, ప్రముఖులు రాజమండ్రి స్వగృహంలో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు.










