Aug 16,2023 18:44

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : కడియం మండలం, దుళ్ల గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి, కడియం ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్‌ ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు ఘనస్వాగతం పలికారు. కోనసీమ జిల్లా, మండపేట వెళుతున్న చంద్రబాబు దుళ్లలో ఆగి ప్రజలకు అభివాదం చేశారు. ముందుగా గ్రామంలో గల మహనీయుడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాధవరాయుడుపాలెం సర్పంచ్‌ అన్నదేవుల వీర వెంకట సత్యనారాయణ (చంటి) నాగలి వరికుచ్చులను చంద్రబాబుకు అందజేశారు. అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే ఉన్న గ్రామ మాజీ సర్పంచ్‌, టిడిపి దళిత నాయకుడు గుర్రపు సత్యనారాయణ (కొండయ్య మాస్టారు)ను పలకరించి భుజం తట్టారు. అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ప్రత్తిపాటి రామారావు చౌదరి, వెలుగుబంటి నాని, ముమ్మిడిదేవి నాగేశ్వరరావు, కాయల సత్యనారాయణ, చిట్టూరి అమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు.