May 25,2023 11:41

ప్రజాశక్తి-కొడాలి (కృష్ణా) : నిర్మాణంలో ఉన్న ఇంటిని తడిపేందుకు వెళ్లి విద్యుత్‌ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలోనిఘంటసాల మండలం కొడాలి గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడాలి గ్రామానికి చెందిన జగనన్న లేఅవుట్‌లో కొడాలి వెంకటేశ్వరరావు కొత్తగా ఇళ్లు నిర్మాణం చేసుకుంటున్నారు. వెంకటేశ్వరరావు కుమారుడు గోపి (27) గురువారం ఉదయం ఇంటిని తడిపేందుకు వెళ్లి మోటార్‌ వేయగా ప్రమాదవశాత్తు షాక్‌ గురై సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కుడిపూడి శ్రీనివాసు తెలిపారు. అందరితో కలివిడిగా ఉంటూ ఆప్యాయంగా పలకరించే గోపి హఠాన్మరంతో కొడాలి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.