ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
తూర్పు గోదావరి జిల్లాలో రబీ 2022-23 సీజన్‌లో 1,84,663 ఎకరాల్లో ఈ-క్రాప్ నమోదు చేసి రైతుల ఇకెవైసి 98.07 శాతం పూర్తి చేశామని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022-23 సీజన్‌లో ఈ-క్రాప్ నమోదు మొదటిగా తుది గడువు ఫిబ్రవరి 10 వరకూ నిర్ణయించామన్నారు. రైతులను దష్టిలో పెట్టుకొని మార్చి 4వరకూ గడువును పొడిగించామన్నారు. ఆర్‌బికె సిబ్బంది ద్వారా రైతులను చైతన్య పరిచి ఈక్రాప్ నమోదు చేశామన్నారు. జిల్లాలో అన్ని గ్రామాల్లోని ఆర్‌బికెల వద్ద మార్చి 10న ఈ-క్రాప్ మూసాయిదా జాబితాను ప్రదర్శించామన్నారు. సామాజిక తనిఖీల్లో భాగంగా రబీ 2022-23 సీజన్‌కి సంబంధించి ఈ-క్రాప్ మూసాయిదా జాబితాను ఈ నెల 13 నుంచి 17 వరకూ ప్రదర్శిస్తామన్నారు. తదుపరి గ్రామ సభలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్‌బికె పరిధిలో ఉన్న రైతులు ఈ జాబితాలను పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా అభ్యంతరాలుంటే సవరణ కోసం ఆర్‌బికెల్లో ఉన్న విఎఎ, విహెచ్‌ఎ, విఎస్‌ఎలను సంప్రదించాలన్నారు. అభ్యంతరాలను రాత పూర్వకముగా తెలియ జేయాలన్నారు. తుది జాబితా ప్రదర్శన తరువాత ఎటువంటి మార్పులు చేర్పులు చేయబోమని స్పష్టం చేశారు.










