ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ఈ నెల 8, 9, 10 తేదీల్లో రాజమహేంద్రవరం నగరంలో సీ ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరా లను కలెక్టరేట్‌లో ఆమె ప్రకటించారు. ''సీ ఫెస్టివల్'' వేడుకలు రాష్ట్రంలో విజయవాడ, కర్నూల్, విశాఖపట్నం, రాజమహేం ద్రవరంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సీ ఫుడ్ వినియోగాన్ని పెంపుదలలో భాగంగా మత్స్య సంపద వలన కలిగే ప్రయోజనాన్ని, వాటి ద్వారా లభించే పోషక విలువలపై ప్రజల్లో గణనీయమైన అవగాహన కల్పించడం ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు. నిత్యం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవడం తప్పనిసరి అని తెలిపారు. ఇతర నాన్ వెజిటేరియన్ ఆహార పదార్థాల కంటే సీ ఫుడ్ ఆరోగ్యకరమైన కొవ్వుతో నిండిన ఆహారం తీసుకోవడం సాధ్యం అవుతుందన్నారు. ఈ ప్రాంతంలో మంచి ఆక్వా కల్చర్‌తో కూడిన ఉత్పత్తులు లభ్యం అవుతాయని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆర్ట్స్ కళాశాల నుంచి మునిసిపల్ కార్యాలయం గోకవరం బస్టాండ్ వరకు 2 కె రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, భూమి ఆర్గానిక్ సంస్థ అధినేత రఘురామ్, ఇతర జిల్లా అధికారులతో కలిసి ఉదయం 7 30కి ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొదటి రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం ఫిష్ ఆంధ్రా డొమెస్టిక్ మార్కెటింగ్ లబ్దిదారులతో, సరఫరాదారులతో సమావేశం జరుగుతుందని వివరించారు. రెండో రోజు ఆక్వా రైతులు, ప్రోఫెసర్లు, ఎగుమతిదార్లతో సదస్సు, విద్యార్థులకు వివిధ ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. మూడో రోజు ప్రభుత్వ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు వకత్వ, వ్యాస రచన, డీబెట్‌లలో పోటీలని నిర్వహించిన అనంతరం విజేతలకు బహుమతులు ప్రధానోత్సవం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జెసి ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జీ. నరసింహులు, మత్స్య శాఖ సహాయ సంచాలకులు ఎస్‌కె దిల్షక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టూరిజం ఈడి వి. వెంకటచలం, భూమి ఆర్గానిక్ సంస్థ అధినేత రఘురామ్, తదితరులు పాల్గొన్నారు.










