ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్
జిల్లాలో కళ్యాణమస్తు, షాదీ తోఫాలో భాగంగా 677 జంటలకు రూ.5.05 కోట్ల మేర సొమ్ములు జమేశామని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దూరదృష్టితో వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, వైఎస్‌ఆర్ షాదీ తోఫాలకు అర్హత సాధించాలంటే వధూవరులిద్దరికీ 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరని నిబంధన పెట్టారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కచ్చితంగా పదో తరగతి చదివించేలా ఈ పథకాలు దోహదం చేస్తున్నాయని తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, వైఎస్‌ఆర్ షాదీ తోఫా 3వ విడత నగదును పంపిణీని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడారు. వైఎస్‌ఆర్ కళ్యాణమస్తూ, వైఎస్‌ఆర్ షాది తోఫాతో కలిపి మూడు విడతల్లో 1307 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.9.79 కోట్లు ప్రభుత్వం జమ చేసిందన్నారు. దూదేకుల, నూర్ బాషాల విజ్ఞప్తిని మన్నించి వారికి కూడా వైఎస్‌ఆర్ షాదీ తోఫాతో సమానంగా లబ్ధి రూ.లక్షకు పెంచిందన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలకు రూ.లక్ష చొప్పున, ఎస్‌సి, ఎస్‌టిలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.1.20 లక్షలు, బిసిలకు రూ.50 వేలు, కులాంతర వివాహం చేసుకుంటే రూ.75 వేలు, మైనార్టీలకు రూ. లక్ష, విభిన్న ప్రతిభావంతులైన వారికి రూ.1.50 లక్షలు, భవన నిర్మాణ కార్మికుల కు రూ.40 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ ఎస్.సుభాషిణి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం.సందీప్, యువ జంటలు పాల్గొన్నారు










