Sep 14,2023 08:09
  •  మూడింటిని నిర్మించిన మేఘా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఒకేసారి ఐదు మెడికల్‌ కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 15న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతనంగా నిర్మించిన ఐదు వైద్య కళాశాలలను ప్రారంభించనున్నారు. ఈ ఐదింట్లో విజయనగరం వైద్య కళాశాలను ప్రత్యక్షంగా ప్రారంభించనుండగా, నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం వైద్య కళాశాలలను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఈ కళాశాలల్లో మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రిలోని వైద్య కళాశాలను మేఘా కంపెనీ నిర్మించింది. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం మేరకు రాష్ట్రంలో కొత్తగా 17 నూతన వైద్య కళాశాలల స్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఏడాది ఐదు కళాశాలలను పూర్తి చేసి ఎంసిఐ గుర్తింపుతో ఈ ఏడాది నుండే తరగతులు ప్రారంభం కానున్నాయి. ఒక్కో మెడికల్‌ కళాశాలకు 150 సీట్లను ఎంసిఐ మంజూరు చేసింది. రాష్ట్ర వైద్య విద్యా రంగం, ఆరోగ్య సంరక్షణలో కీలకమైన ఈ ఘట్టంలో తాము భాగస్వామ్యం కావడం పట్ల మేఘా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు : సజ్జల

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యసేవలు అందించేలా డాక్టర్‌ సెల్‌ సభ్యులు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైసిపి కేంద్ర కార్యాలయంలో వైసిపి డాక్టర్‌ సెల్‌ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా జగనన్న ఆరోగ్య సురక్ష పోస్టరును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నవరత్నాల ప్రోగ్రామ్‌ వైస్‌ ఛైర్మన్‌ నారాయణ మూర్తి, ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ప్రత్యేక అధికారి యాదాల అశోక్‌ బాబు, వైసిపి డాక్డర్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాల మేరకు డాక్టర్‌ సెల్‌ సేవలను విస్తృతం చేయాలన్నారు.