ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
జిల్లాలో 372 గ్రామ సర్వేయర్ల సర్వీసును క్రమబద్ధీకరణ చేసి, వాటి వివరాలను సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు చేశామని జెసి తేజ్‌భరత్ తెలిపారు. 2019లో నియామకమైన గ్రామ సర్వేయర్ల సర్వీస్ క్రమబద్దీకరణ, సర్వీస్ రిజిస్టర్‌లో వివరాలు నమోదు కోసం ఉద్యోగులు అర్జీ ఇచ్చారని జెసి తెలిపారు. ఈ సమస్యను సిసిఎల్‌ఎ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఆ క్రమంలో జిల్లా సర్వే ల్యాండ్ అధికారి ద్వారా జిల్లాకు చెందిన 372 గ్రామ సర్వేయర్ల సర్వీస్ క్రమబద్దీకరణ చేసి, వాటి వివరాలు సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు చేసి సమస్యను పరిష్కరించామని తెలిపారు. అర్హత కలిగిన గ్రేడ్ -3 గ్రామ సర్వేయర్లకు గ్రేడ్ -2 గ్రామ సర్వేయర్ల ఉద్యోగోన్నతి కల్పించామన్నారు. దీనిపై సర్వేయర్ల సంఘం కార్యదర్శి పి.యామినిముఖర్జీ తదితరులు కలెక్టర్, జెసిలకు కృతజ్ఞతలు తెలిపారు. జెసి చేతుల మీదుగా వారు ఉత్తర్వులను తీసుకున్నారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక స్పందన(గ్రీవెన్స్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జెసి ఎన్.తేజ్‌భరత్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉద్యగుల ప్రత్యేక గ్రీవెన్స్‌లో జెసి ఎన్.తేజ్‌భరత్, డిఆర్‌ఒ నరసింహంను ఉద్యోగుల నుంచి వినపత్రాలను స్వీకరించారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి 7 అర్జీలను స్వీకరించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పాలనలో భాగస్వామ్యం అవుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారికి భరోసా ఇచ్చేందుకు ఈ ప్రత్యేక స్పందనను ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని తలెఇపారు. నలజర్ల మండలం పోతవరం వివేకానంద ఎయిడెడ్ స్కూల్ కరస్పాండెంట్ నుంచి సర్వీస్ రిజిస్టర్ ఇప్పించాని నల్లజర్ల మండలం ఆసన్నపాలెం సిఎస్‌ఐ ఎయిడెడ్ పాఠశాలలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఎస్‌జిటి టీచర్ ఎస్.సుగుణకుమారి అర్జీ పెట్టుకున్నారు. మెటర్నిటీ సెలవు జీతభత్యాలు ఇప్పించాలని సహకార శాఖలో జూనియర్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కె.లీలశ్రీ వినతిపత్రం అందించింది. ఇతర శాఖల ఉద్యోగుల మాదిరిగా హెచ్‌ఆర్‌ను అందించాలని కొవ్వూరు మత్స్యశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న పి.కృష్ణవేణి అర్జీ పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒలు ఎస్.మల్లిబాబు, ఎ.చైత్రవర్షిణి, సిపిఒ ఎ.ముఖలింగం, ఎస్‌ఇపిఆర్‌ఎ బివి.ప్రసాద్, డ్వామా పీడీ పి.జగదాంబ, ఇతర జిల్లా అధికారులు, పాల్గొన్నారు.










