ప్రజాశక్తి-రాజమహేంద్రవరం జిల్లాలో జగనన్న వసతి దీవెన కింద 2022-23 సంవత్సరానికి 32,078 విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు రు.30.58 కోట్లు జమ చేసినట్టు కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం అనంతపురం జిల్లా నార్పల గ్రామంలో ప్రారంభించిగా.. స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్ మాధవీలత, రుడా చైర్‌పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి అధికారులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డురాకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన విద్యార్థులందరికీ అందిస్తున్న విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి వంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ.20 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోందన్నారు. జిల్లాలో జగనన్న వసతి దీవెన కింద 32,078 విద్యార్థులకు చెందిన 28,769 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు రు.30.58 కోట్లు జమ చేయడం జరిగిందని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. రుడా చైరపర్సన్ మేడపాటి షర్మిళారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఉన్నత విద్యను ప్రోత్సహిస్తు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు.
జిల్లాలో నియోజకవర్గాల వారీగా...
అనపర్తి నియోజకవర్గంలో 3,404 మంది విద్యార్థులకు, రాజానగరం నియోజకవర్గంలో 4,017 మంది విద్యార్థులకు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో 5,008 మందికి, అర్బన్ నియోజకవర్గంలో 60,45 మంది, గోపాలపురం నియోజకవర్గంలో 3,642 మంది, కొవ్వూరు నియోజకవర్గంలో 4,129 మంది, నిడదవోలు నియోజకవర్గంలో 4,998 మంది, జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో 776 మంది, రంపచోడవరం నియోజకవర్గం (ఎస్‌టి) గోకవరం మండలంలో 59 మంది, మొత్తం 32,078 విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు రు.30.58 కోట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేరుగా బటన్ నొక్కి జమ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమాధికారి జ్యోతి, సందీప్, సూపరింటెండెంట్ యం.బాబీ, విద్యార్థులు తల్లిదండ్రులు, పాల్గొన్నారు.










