Feb 21,2023 23:09

నిరసన తెలుపుతున్న తపాలా శాఖ ఉద్యోగులు, సిబ్బంది

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
అశాస్త్రీయమైన టార్గెట్ల పేరుతో అధికారుల వేదింపులను వ్యతిరేకిస్తూ తపాలా ఉద్యోగుల చేపట్టిన నిరసన రెండోరోజైన మంగళవారమూ కొనసాగింది. అధికారుల మొండి వైఖరికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి రాజమండ్రి తపాలా డివిజన్‌లో పోస్టల్‌ ఐక్య కార్యాచరణ సమతి ఏర్పాటు చేశామని తపాలా ఉద్యోగ సంఘాల కార్యదర్శి బి.కొండబాబు తెలిపారు. ప్రధాన తపాలా కార్యాలయం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అశాస్త్రీయమైన టార్గెట్ల వల్ల ఉద్యోగులు మానసిక వేదనకు గురౌతున్నారన్నారు. అధికారుల వత్తిడి వల్ల సొంత డబ్బులతో టార్గెట్స్‌ చేస్తున్నారన్నారు. తపాలా పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, వారిని ఖాతాలు తెరిచే విధంగా అధికారులు భాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. రామచంద్రాపురం ప్రధాన తపాలా కార్యలయం దగ్గర కూడా నిరసన కార్యక్రమాలు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు యుజి.ప్రకాష్‌, ఎవి.నరసింహారావు, సిబ్బంది పాల్గొన్నారు.