May 18,2023 22:55

పర్యటనా స్థలాలను పరిశీలస్తున్న హోం మంత్రి, కలెక్టర్‌ తదితరులు

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌
ఈ నెల 24న కొవ్వూరులో సిఎం జగన్‌ పర్యటించనున్నారు. 'జగనన్న విద్యా దీవెన' రాష్ట్ర స్థాయి వేడుకలు ఇక్కడ నిర్వహించనున్నట్టు హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. సోమవారం కొవ్వూరులో సిఎం పర్యటనా ఏర్పాట్లను కలెక్టర్‌ ఇతర అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ సిఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వివిధ ప్రదేశాలను పరిశీలించామన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో జిల్లా యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేశామని ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త, ఎంఎల్‌సి తలశిల రఘురాం తెలిపారు. ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ సిఎం పర్యటన ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. సమన్వయంతో సిఎం పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్‌ సూచించారు. ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బందోబస్తు, వాహనాల మళ్లింపు, పార్కింగ్‌ తదితర వివరాలను ఎస్‌పి సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అనంతరం ఆర్‌డిఒ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, జెసి ఎన్‌.తేజ్‌భరత్‌, ఆర్‌డిఒ ఎస్‌.మల్లిబాబు, ఇతర జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు.