ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అర్హులైన లబ్ధిదారులకు అందచేసే సంక్షేమ పథకాల వార్షిక ప్రణాళికపై సంక్షేమ క్యాలండర్‌ను విడుదల చేసినట్టు కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు. గురువారం రాత్రి కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్‌లో 2023-24 ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ను ప్రదర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలు ముందుగా ప్రజలకు తెలియ పరచడం ద్వారా లబ్ధిదారులలో చైతన్యం తీసుకుని వస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే వార్షిక ప్రణాళిక తో కూడిన క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించినట్టు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని అందించాలనే లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ ఎవరైనా అర్హత కలిగి పథకం ప్రయోజనం పొందకుండా ఉంటే అటువంటి వారిని గుర్తించి ఆ ఏడాది డిసెంబర్‌లో వాటి ప్రయోజనాన్ని కలిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డిపిఒ పి.జగదాంబ, పిఆర్ ఎస్‌ఇ ఎస్‌బివి.ప్రసాద్, సిపిఒ కె.ప్రకాశ రావు, డిపిఆర్‌ఒ ఐ.కాశయ్య పాల్గొన్నారు.










