ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
జూన్ 1వ తేదీ ఒకటి ఉదయం 10 గంటలకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుంచి కాలువకు సాగునీటిని విడుదల చేస్తారని మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం కలెక్టరేట్‌లో చైర్‌పర్సన్ కలెక్టర్ మాధవీలత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మంత్రి వేణు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం మేరకు 1న నీటిని విడుదల చేస్తామన్నారు. రైతులు నాట్లు వేసే సమయంలో అధికారుల మధ్య సమన్వయం ముఖ్యమన్నారు. నీటి లభ్యత ఆధారంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. మూడు పంటలు వేయాలన్నది సిఎం జగన్మోహన్‌రెడ్డి ఆలోచన అన్నారు. ఖరీఫ్ సీజన్లో సాగు ముందస్తుగా చేపట్టడం ద్వారా ప్రకతి విపత్తుల నుంచి పంటను కాపాడడం సాధ్యం అవుతుందన్నారు. ఈ మేరకు గత సీజన్లో నష్ట నివారణ చర్యలు సత్ఫలితాలు ఇచ్చిందన్నారు.
మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ గత సీజన్లో ఎదురుకొన్న అంశాలను పరిగణనలోకి కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. గత ఖరీఫ్ సీజన్లో తీసుకున్న నిర్ణయం వల్ల రైతులకు నష్టం వాటిల్లకుండా చూడడం సాధ్యమైందన్నారు.
కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ముందస్తు సాగుతో ప్రకృతి విపత్తుల నుంచి పంటను కాపాడుకోవచ్చన్నారు. మండల స్థాయి వ్యవసాయ మండలి సమావేశంలో ఏ రోజున పంట వేయాలనేదానిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. చాగల్నాడు లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్న 6,240 ఎకరాల ఆయుకట్టుకు జూన్ 15 నాటికి నీటి విడుదల చేయాలన్నారు.
గోదావరి డెల్టాకు జూన్ 1న, చాగల్నాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఆయకట్టుకు జూన్ 15న, వెంకటనగరం పంపింగ్ స్కీమ్‌కు జూన్ 7న, తొర్రిగెడ్డ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు జూన్ 14న, ఏలూరు ఇరిగేషన్ సర్కిల్ పరిధిలో ఎర్రకాలువ రిజర్వాయర్ ప్రాజెక్టుకు జూన్ 25న, కొవ్వాడ కాలువ రిజర్వాయర్ ప్రాజెక్టుకు జూన్ 12న, పిఐపిఎల్‌ఎంసి సర్కిల్, తుని పరిధిలో ప్రాజెక్టుల నికర ఆయకట్టుకు, పుష్కర ఎత్తిపోత పథకానికి జూన్ 22న, ముసురుమిల్లి రిజర్వాయర్ ప్రాజెక్టుకు జూలై 1న, జెవిఆర్‌కె.సూరంపాలెం రిజర్వాయర్ స్కీమ్‌కు జులై మొదటి వారంల, పిఐసిఆర్‌ఎంసి సర్కిల్, ఏలూరు పరిధిలో ప్రాజెక్టుల నికర ఆయకట్టుకి తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా జూలై మొదటి వారంలో ఖరీఫ్ సాగుకు నీటి విడుదల కోసం ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.
ఈ సమావేశంలో జడ్‌పి చైర్మన్ వి.వేణుగోపాలరావు, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, జెసి ఎన్.తేజ్‌భరత్, సహాయ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్, ఇరిగేషన్ ఎస్‌ఇ జి.శ్రీనివాసరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.










