Jan 30,2023 22:35

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ఈ ఏడాది జిల్లాలో జగనన్న చేదోడు పథకం కింద రజక, నాయీ బ్రాహ్మణులు, టైలర్లు వత్తిదారులైన 13,491 మందికి రూ.13.49 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా సోమవారం జమ చేశామని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత, ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ పేర్కొన్నారు. సోమవారం జగనన్న చేదోడు రాష్ట్రస్థాయి కార్యక్రమం పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన బహిరంగ సభలో బటన్‌ నొక్కి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలో జమ చేశారు. స్థానిక కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌, ఎంపీ, డిసిసిబి చైర్మన్‌ ఆకుల వీర్రాజు, రుడా చైర్‌పర్సన్‌ ఎం.షర్మిళరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ, ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున వారి ఖాతాలకు జమ చేసినట్టు చెప్పారు. కుల వృత్తులు చేసుకునే కుటుంబాలకు నేరుగా ఆర్థిక సహాయం వారి బ్యాంకు ఖాతాలకు ఎటువంటి మధ్యవర్తులు లేకుండా వారి ఖాతాలోకి జమ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని వారి కుల వత్తుల పెంచుకోవడం కోసం, ఆయా కుటుంబాలకు ఆర్థిక భరోసా కోసం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ మాట్లాడుతూ జగనన్న చేదోడు పథకం కింద జిల్లాలో గత రెండు విడతలుగా 12,181 మంది లబ్ధిదారులకు రూ.22.12 కోట్లు అందజేసినట్టు చెప్పారు. ఈ సమావేశంలో సూర్య బలిజ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాలే రాజేశ్వరరావు, దేవాంగుల డైరెక్టర్‌ మల్లేశ్వరి, బిసి సంక్షేమ అధికారి పి.సత్య రమేష్‌, ఎఎఒ జి.సత్యనారాయణ, సిబ్బంది బి.రాజకుమారి పాల్గొన్నారు.