Jul 17,2023 23:35

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి పని ఒత్తిడి, సెలవులు లేకపోవడంతో 108 సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు సక్రమంగా వేతనాలు ఇవ్వడం లేదు. గట్టిగా నిలదీస్తే పైస్థాయిలో వేధింపులు తప్పడం లేదు.. ఇలా శారీరకంగా, మానసికంగా, ఆర్థికపరంగా సిబ్బంది సమస్యలతో సతమతమవుతున్నారు. తీరకలేని విధులతో 108 అంబులెన్స్‌ సిబ్బంది సతమతమవుతున్నారు. నాలుగు రోజులకు ఒకసారి ఆఫ్‌ ఇవ్వాల్సి ఉంది. సిబ్బంది కొరతతో సెలవులు మంజూరు చేయడం లేదు. కనీసం ఆఫ్‌లు ఇవ్వడం లేదు. విరామం లేకుండా విధులు నిర్వహిస్తుండడంతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. గడచిన 8 నెలల నుంచి వేతనాలు రెండు నెలలకోసారి ఇవ్వటంతో ఆర్థికంగా దెబ్బతింటున్నారు. కుటుంబ పోషణకు కష్టాలు పడుతున్నారు. ఇటువంటి సమస్యలకు పరిష్కారానికి నిరసనలు తెలుపుతున్నా ఫలితం లేకుండా పోతోంది. సిబ్బందిపై వేధింపులు అధికమవుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నిస్తే అదనపు విధులు వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు.
జిల్లాలో 300 మంది ఉద్యోగులు
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో 68 వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల్లో దాదాపుగా 300 మంది వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఒక్కొక్క వాహనానికి 5 మంది చొప్పున కనీసం గా 340 మంది సిబ్బంది పని చేయాల్సి ఉంది. ఒక మండలంలో వాహనం అందుబాటులోకి లేనట్టయితే మరో మండల వాహనాన్ని పంపుతున్నారు. ప్రతి వాహనానికి నలు గురు సిబ్బంది ఉన్నారు. ఇద్దరు పైలట్‌లు, మరో ఇద్దరు ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నిషియన్‌లు సేవలందిస్తున్నారు. పగటి వేళల్లో ఇద్దరు, రాత్రి వేళల్లో ఇద్దరు వంతున విధులు నిర్వహిస్తున్నారు. రెండు వాహనాలకు వచ్చేసరికి పది మంది సిబ్బంది ఉండాలి. అంటే నాలుగు రోజులకు ఒకసారి ఆఫ్‌ ఇచ్చినప్పుడు అదనంగా ఉండే ఇద్దరు సిబ్బంది విధుల్లో ఉంటారు. ప్రస్తుతం రెండు వాహనాలకు 8 మంది సిబ్బందితోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. దానివల్ల ఆఫ్‌లు లేకుండా పోతున్నాయి. సెలవులు ఇవ్వడం లేదు. సిబ్బంది నిత్యం విధుల్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తీరిక లేకుండా సిబ్బంది విధులు నిర్వహించాల్సి వస్తోంది..
అమలాపురం, రాజమండ్రి నుంచి కాకినాడ రిఫర్‌లు అధికం
ప్రతి మండలంలోనూ 108 వాహనాలు అందుబాటులో ఉండాలి. అత్యవసర సమయాల్లో సేవలందించాలి. ఇప్పుడా పరిస్థితి లేదు. రాజమహేంద్రవరం అమలాపురం వంటి జిల్లా కేంద్రాల నుంచి ప్రతిరోజు 5 లేక 6 వాహనాలు కాకినాడకు రిఫర్‌ చేస్తున్నారు. ఏరియా ఆస్పత్రి నుంచి రిఫర్‌ చేసే కేసులకు ఆసుపత్రి సొంత వాహనాలు వినియోగించుకోవాలి. సొంత వాహనాలు లేకపోవడంతో 108లో కాకినాడ పంపుతున్నారు. జిల్లాలోని అన్ని పట్టణాల్లోని ఆస్పత్రులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రతిరోజు ఒక్కో ఆస్పత్రి నుంచి కనిషంగా నాలుగు కేసులను కాకినాడకు రిఫర్‌ చేస్తున్నారు. ఇలా 108 వాహనాలు ఇప్పుడు రిఫర్‌ కోసమే ఉప యోగపడుతున్నాయి. ఫలితంగా అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి వాహనం వచ్చేసరికి బాధితులు వేరేలా ఆస్పత్రులకు చేరుకుంటున్నారు.
సకాలంలో అందని వేతనాలు
గతంలో 108 సిబ్బందికి అత్యవసర విభాగాలుగా గుర్తించేవారు. క్రమం తప్పక వేతనాలు మంజూరు చేసేవారు. ప్రతినెల సిబ్బందికి వేతనం సక్రమంగా ఇవ్వడం లేదు. ప్రభుత్వమే నిధులు సమకూర్చకపోవడంతో జీతాలు పడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి 108లో పనిచేసే సిబ్బందికి జూనియర్‌కు రూ.18 వేలు, సీనియర్‌కు రూ.28 వేల వరకు వేతనం ఇస్తున్నారు. అదికూడా రెండు లేక మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వకపోవడం వల్లే సక్రమంగా వేతనాలు ఇవ్వలేకపోతోంది. దీనిపైనా సిబ్బంది ఒత్తిడి చేయలేని పరిస్థితిలో ఉన్నారు.