ప్రజాశక్తి-బి.కొత్తకోట
రాష్ట్రంలోని యువతను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మోసగిస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర 44వ రోజుకు చేరుకుంది. గురువారం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలంలోని ఇందిరమ్మకాలనీ నుంచి ప్రారంభమైన పాదయాత్ర మల్లెల క్రాస్, టి.సదుం క్రాస్, సొన్నువారిపల్లి మీదుగా పెదతిప్పసముద్రం మండ లంలోకి పాదయాత్ర ప్రవేశించింది. అక్కడి నుంచి మద్దయ్యగారిపల్లి శివారు వరకు పాదయాత్ర సాగింది. కొమ్మరపల్లి విడిది కేంద్రంలో బస చేశారు. ఆయా ప్రాంతాల్లో స్థానికులు, యువతతో ముఖాముఖి, సమా వేశాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా పలు చోట్ల లోకేష్ మాట్లాడుతూ వైసిపి పాలనలో యువత ఎక్కువగా నష్టపోయిందని తెలిపారు. టిడిపి పాలనలో ఎపి జాబ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉండేదన్నారు. జగన్ పాలనలో ఎపిని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారన్నారు. 60 వేల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే కనీసం గత ప్రభుత్వం కేటాయించిన డిగ్రీ కళాశాల పూర్తి చేయలేని పరిస్థితి ఉందన్నారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని, ప్రతి ఏడాది 6,500 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తానని మోసం చేశారని పేర్కొన్నారు.. ప్రతి ఏడాది డిఎస్సీ అన్నారన్నారు. ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తామని, అన్ని ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. జైలుకి వెళ్ళిన ఆర్ధిక ఉగ్రవాదిని చూసి పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారని, కోడి గుడ్డు మంత్రిని చూసి ఎవరు వస్తారన్నారు. జగన్ పాలనలో వచ్చిన ఒక్క పరిశ్రమ చూపించమని ఛాలెంజ్ చేస్తున్నానని పేర్కొన్నారు. టిడిపి తెచ్చిన కంపెనీలకి రిబ్బన్ కటింగ్ చేయడం తప్ప మీరు తెచ్చిన కంపెనీ ఒక్కటి అయినా ఉందా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి ఆ తర్వాత మాటతప్పి మడమతిప్పడం జగన్ నైజమన్నారు. బుడుగ, బేడజంగాల సమస్యపై అధ్యయన కమిటీ నివేదిక పరిశీలించి న్యాయం చేస్తామని తెలిపారు. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సబ్సిడీ రుణాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ టిడిపి అభ్యర్థి గంటా నరహరి, నియోజకవర్గం ఇన్‌ఛార్జి జి.శంకర్ యాదవ్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎస్.ఎం.ఫర్వీన్ తాజ్, టిడిపి రాజంపేట పార్లమెంట్ బిసి సెల్ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు శ్రీనాథ్ రెడ్డి, సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.










