కడప అర్బన్ : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక యువతను దారుణంగా మోసం చేశారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర 118 రోజుకు చేరు కుంది. మంగళవారం కడప శివారులోని బిల్టప్ విడిది కేంద్రం నుంచి పాద యాత్ర ప్రారంభమై కడప నగరంలోని రామకృష్ణ కాలేజి, మాసీమ సర్కిల్, రెండవ గాంధీబొమ్మ, చెన్నూరు బస్టాండ్, మొదటి గాంధీబొమ్మ, గోకుల్ సర్కిల్, కృష్ణదేవరాయ సర్కిల్, శంకరాపురం, అస్సర సర్కిల్, ఎన్‌టిఆర్ సర్కిల్, చిన్నచౌక్, రాజరాజేశ్వరి కల్యాణ మండపం ఎదుట విడిది కేంద్రం వరకూ పాద యాత్ర సాగింది. ఆయా ప్రాంతాల్లో రెడ్డి సామాజికవర్గీయులు, బ్రహ్మణ, ముస్లి ములు, వైశ్యులు, నిరుద్యోగులు, దినసరి కూలీలు, స్థానికులతో ముఖాముఖి, మాటామంతి, సమావేశాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా పలుచోట్ల లోకేష్ మాట్లాడుతూ అబద్దాలు, మోసం, వంచనకు ప్రతిరూపం జగన్ అని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రతి ఏటా జాబ్ కేలండర్, 2.3 లక్షల ఉద్యోగాలిస్తానని చెప్పి మోసగించారని తెలిపారు. జగన్ నిర్వాకం కారణంగా తీవ్ర నిరాశ,నిస్పహలకు గురైన 470 మంది యువతీ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతను గంజాయి, మత్తుపదార్థాలకు బానిసలుగా మార్చి, వారి రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక ఒక్క జాబ్ కేలండర్ గానీ, ఉద్యోగం కానీ లేదని చెప్పారు. టిడిపి అధికారంలోకి వచ్చాక కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని వేగవంతం చేసి స్థానిక యువతకు ఉద్యో గాలు కల్పిస్తామన్నారు. వైసిపి ప్రభుత్వంలో కేవలం నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారన్నారు. సజ్జల, సాయిరెడ్డి, పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డికి తప్ప ఏ ఇతర కుటుంబానికి న్యాయం జరగలేదని చెప్పారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తయారు చేస్తామన్నారు. దానిమ్మ, అరటి, బొప్పాయి, మామిడి, కర్జూరం తదితర పంటలు వేసేలా అధిక ప్రోత్సాహం ఇస్తామని తెలిపారు. రాయలసీమ రైతులకు సరైన ప్రోత్సాహం ఇస్తే బంగారం పండిస్తారని చెప్పారు. పరిపాలన ఒకే చోట అభివద్ది వికేంద్రీకరణ టిడిపి నినాదమన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఫ్యాక్షన్‌లో ఇబ్బంది పడిన కుటుంబాలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆదుకుంటున్నామన్నారు. రెడ్డి కార్పొరేషన్ పెట్టడమే తప్ప జగన్ ఒక్క రూపాయి కేటాయించలేదని విమర్శించారు. రైతులకు కులం ఉండదని, ఇప్పుడు రైతుల్లో కూడా జగన్ ప్రభుత్వం కులం చూస్తోందన్నారు. మోటార్ల మీటర్లు పెట్టి రైతులను వైసిపి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన పౌరసేవలందించేందుకు ఉద్దేశించిన మీ సేవ వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారన్నారు. మీ-సేవల ద్వారా వచ్చే ఆదాయాన్ని తీసుకుంటూ అక్కడ పనిచేసే సిబ్బందిని మాత్రం రోడ్డున పడేశారని తెలిపారు. వారికి 12 నెలలుగా జీతాలు ఇవ్వకపోగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 171 గవర్నమెంట్ అర్బన్ మీసేవ కేంద్రా లను ఎటువంటి నోటీసు లేకుండానే స్వాధీనం చేసుకొని తీవ్ర అన్యాయం చేశారని పేర్కొన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక కులానికొక కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్నివర్గాలను దారుణంగా మోసగించారని తెలిపారు. మైనారిటీల మానప్రాణాలతో పాటు ఆస్తులకు రక్షణ లేకుండాపోయిందని ఆవే దన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా వేలకోట్ల రూపాయల మైనార్టీల ఆస్తులను వైసిపి నేతలు కబ్జా చేశారని విమర్శించారు. యువతకు తీరని ద్రోహం చేశారని తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్‌కు రెండుసార్లు శిలాఫలకాలు వేసిన జగన్ ఆ పనులను అడుగు కూడా ముందుకు కదల్చలేదన్నారు.










