Jul 19,2021 11:47

అమరావతి : కొత్త జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన సీఎం ఇల్లు ముట్టడి కార్యక్రమంలో నిర్బంధాలను, అక్రమ అరెస్టులను ఎదురొడ్డి నిరసన తెలిపిన యువత ఉద్యమ స్ఫూర్తిని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారని, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఎక్కడ అని సిఎం జగన్‌ ని ప్రశ్నించారు. నిరుద్యోగుల ఉద్యమాన్ని నిర్బంధంతో అణచివేయలేరని అన్నారు. కొంతమంది పోలీస్‌ అధికారులు, అధికార పార్టీ కార్యకర్తల కంటే దిగజారి పనిచేయడం విచారకరమన్నారు. ఆర్టికల్‌ 19 ప్రకారం తమకు జరిగిన అన్యాయంపై ప్రజలకు నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని తెలిపారు. నిరుద్యోగ యువత నిరసన తెలిపితే కేసులు పెట్టి భవిష్యత్తు దెబ్బతీస్తామని స్వయంగా గుంటూరు ఎస్పీ బెదిరించడం రాష్ట్రంలో అరాచక పాలనకి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ పోరాట సమితి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మహౌద్యమంగా మారుతుందన్నారు. ఉద్యోగాల భర్తీకి కొత్త జాబు క్యాలెండర్‌ విడుదల చేయాలని, అరెస్ట్‌ చేసిన విద్యార్థి, యువ నేతలందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.