రాజంపేట అర్బన్ : నేటి యువత విజ్ఞాన పరంగా ఎంత అభివద్ధి చెందినా నైతిక పరంగా అట్టడుగు స్థాయిలో ఉన్నారని జమ అతె జిల్లా అధ్యక్షులు ఎంఎస్. మొయిద్దీన్ అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని జమ అతె కార్యాలయంలో మానవత, నైతికత అనే అంశంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువతలో మార్పు తీసుకొచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 11 నుంచి 20 తేదీ వరకు ఈ ఉద్యమం నిర్వహిస్తున్నామని చెప్పారు. పెంపుడు జంతువులకు ఇస్తున్న విలువలు కూడా సాటి మనిషికి ఇవ్వడం లేదన్నారు. నైతికతతో కూడిన మానవత్వం అనేది ఒక మనిషిని సంపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దు తుందని అన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడటంవల్ల సమాజం పక్కదారి పడుతుందన్నారు. ప్రజల్లో మార్పు తెచ్చేందుకే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల అవగాహన పెంచుకొని భావితరాలకు ఆదర్శంగా జీవించాలని సూచించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఖాజాపీర్, సయ్యద్ అస్లాం, కమిటీ సభ్యులు అలా ప్రకాష్, సిద్ధిక్ పాల్గొన్నారు.










