Jun 06,2023 21:11

క్రీడా కారులను అభినందిస్తున్న కలెక్టర్‌ గిరీష, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

రాయచోటి : యువత చదువుతోపాటు క్రీడల పైనా దృష్టి సారించి బాగా రాణిం చాలని కలెక్టర్‌ గిరీష, శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్‌ ఆవరణలో జిల్లా యువజన సర్వీసుల శాఖ, క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడాకారులకు కలెక్టర్‌ శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త వివిధ క్రీడా పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ క్రీడల వల్ల దేహదారుడ్యం మెరుగవడంతో పాటు భవిష్యత్తు బంగారు బాట అవుతుందన్నారు. ప్రభుత్వం క్రీడల అభివద్ధికి ఎంతోగానో దోహదపడుతోందని, ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుందన్నారు. క్రీడలను ప్రోత్సహించే నిమిత్తం ప్రభుత్వ సూచనలు, శాప్‌ ఆదేశాల మేరకు జిల్లాలో మే 1 నుంచి జూన్‌ 5 వరకు జిల్లా వ్యాప్తంగా 50 వేసవి క్రీడా శిబిరాలు నిర్వహించామని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం నుంచి రూ 3.50 లక్షల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. వేసవి క్రీడా శిబిరాలు ముగింపు సందర్భంగా వాలీబాల్‌, బాస్కెట్‌ బాల్‌, ఫుట్‌ బాల్‌, క్రికెట్‌, ఖోఖో, కబడ్డీ, యోగాకు సంబంధించిన క్రీడా పరికరాలను యువతకు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడా పరికరాలను బాగా వినియోగించుకొని ఆయా క్రీడలలో రాణించాలని సూచించారు. యువతకు చదువు క్రమశిక్షణ ఎంత ముఖ్యమో క్రీడలూ అంతేనన్నారు. హాకీ, బాస్కెట్బాల్‌, క్రికెట్‌ లాంటి క్రీడలలో బాగా శిక్షణ పొంది జిల్లా నుంచి వెళ్లిన వారిలో చాలామంది క్రీడలలో రాణిస్తున్నారని చెప్పారు. తెల్లవారు జామునే లేచి ఫిజికల్‌ ఎక్సర్సైజులు, యోగా చేయాలని సూచించారు. ప్రస్తుతం క్రీడా పరికరాలు పొందిన పిల్లలందరూ వాటిని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. త్వరలో ఖేలో ఆంధ్ర ప్రోగ్రాం చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాదికి వేసవి సెలవుల క్యాంపుల్లో పాల్గొనే క్రీడా సంఘాలతో పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కెజిబివి, మోడల్‌ స్కూల్స్‌ సంక్షేమ హాస్టల్లోని పిల్లలకు క్రీడా పరికరాలు పంపిణీ చేయగలిగేలా తగు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని స్టెప్‌ సిఇఒకు సూచించారు. రాయచోటిలో నూతనంగా నిర్మిస్తున్న క్రికెట్‌ స్టేడియానికి అవసరమైన మెటీరియల్‌ తెప్పించుకునేలా ప్రతిపాదనలు రూపొం దించుకోవాలని పేర్కొన్నారు. అనంతరం వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులకు వాలీబాల్‌, బాస్కెట్‌ బాల్‌, ఫుట్‌ బాల్‌, క్రికెట్‌ పరికరాలను, ఖోఖో, కబడ్డీ మోకాలి క్యాప్స్‌, యోగా మాట్స్‌ , సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో స్టెప్‌ సిఇఒ గ్రేస్‌ నిర్మల, క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్‌ కోచ్‌ షఫీ, క్రీడాకారులు పాల్గొన్నారు.