కదిరి అర్బన్ : తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 46వ రోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోకి చేరుకుంది. శుక్రవారం నాడు తనకల్లు మండలానికి చేరుకున్న యాత్ర శనివారం నుంచి చీకటిమానిపల్లిలో బస చేసిన ప్రాంతం నుంచి లోకేష్ పాదయాత్ర కొనసాగించారు. జిల్లాలో మొదటి రోజు తనకల్లు, నల్లచెరువు మండల పరిధిలో కొనసాగింది. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే, కదిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా ఆధ్వర్యంలో లోకేష్‌కు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. లోకేష్ పాదయాత్ర చేస్తూ ఆయ ప్రాంతాల్లో ప్రజలను పలకరిస్తూ, మాట్లాడుతూ ముందుకు నడిచారు. ఆయా ప్రాంతాల్లో గిరిజన, దళిత కుటుంబ సభ్యులతో ముఖాముఖి నిర్వహించారు. లోకేష్ పాదయాత్ర సమయంలోనే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి విజయం సాధించారు. దీంతో నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వ పతకానికి ఈ ఎన్నికలే నిదర్శనం అని టిడిపి నాయకులు స్పష్టం చేశారు.










