ప్రొద్దుటూరు పుట్టపర్తిసర్కిల్ ; యువగళం దెబ్బకి వైసిపి ఎమ్మెల్యేలు వణికిపోతున్నారన్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర 113వ రోజుకు చేరుకుంది. గురువారం ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని చౌటపల్లి విడిది కేంద్రం నుంచి దొరసానిపల్లె, ఆర్ట్స్ కాలేజీ, వన్‌టౌన్ సర్కిల్, ఆర్‌టిసి బస్టాండ్, కొత్తపల్లి ఖాదర్‌బాద్, కొత్తపల్లి విడిది కేంద్రం వరకూ పాదయాత్ర సాగింది. ఆయా ప్రాంతాల్లో బుడగజంగాలు, యువత, చేనేతలు, స్థానికులు, క్రిష్టియన్లు, ఆర్యవైశ్యులు, ముస్లింములతో ముఖాముఖి, మాటామంతి, సమావేశాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రొద్దుటూరులో హూ కిల్డ్ బాబారు ప్లకార్డులు ప్రజలకి చూపించి బాబారుని లేపేసింది ఎవరు అంటూ లోకేష్ ప్రజలను అడిగారు. వివేకాని మర్డర్ చేసింది అవినాష్, జగన్ అంటూ పెద్ద ఎత్తున ప్రజలు నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించకూడదంటూ టిడిపి కార్యకర్తలను డిఎస్‌పి నాగరాజు వారించారు. అన్ని అనుమతులు తీసుకొని పాదయాత్ర చేస్తున్నామని, మమ్మల్ని రెచ్చగొట్టేలా వైసిపి వాళ్లు ఫ్లెక్సీలు పెట్టినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారంటూ డిఎస్‌పిని లోకేష్ ప్రశ్నించారు. అక్కడి నుండి పోలీసులు వెనుదిరిగిపోయారు. పాదయాత్ర సందర్భంగా శివాలయం సర్కిల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ టిడిపి మ్యానిఫెస్టో దెబ్బకి వైసిపి నాయకుల మైండ్ బ్లాంక్ అయిందన్నారు. 2019 ఎన్నికల్లో ప్రొద్దుటూరుని అభివద్ధిలో పరుగులు పెట్టిస్తాడని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. ఆయన ప్రొద్దుటూరుని గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్, మట్కా, గుట్కా, దొంగనోట్లు, ఇసుక అక్రమ రవాణాకి అడ్డాగా మార్చారని విమర్శించారు. ఏకంగా సొంత ఇంటినే అసాంఘిక కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా మార్చుకున్నారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత కారుకు ఇఎంఐ, అద్దె ఇంట్లో ఉన్న స్థితి నుండి ఇప్పుడు వేల కోట్ల అధిపతి అయ్యారనిమ పేర్కొన్నారు. ప్రొద్దుటూరుకు ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే ఒకరైతే నామినేటెడ్ ఎమ్మెల్యేలు మరో ఇద్దరని తెలిపారు. ఆర్‌బికె రాచమల్లు, బంగారు రెడ్డి, కిరణ్ రెడ్డి ఈ ముగ్గురు ప్రొద్దుటూరుని కేకులా కోసుకొని తినేస్తున్నారని విమర్శించారు. ఏడాదికి రూ.500 కోట్లు ఐదేళ్లలో రూ.2500 కోట్లతో ప్రొద్దుటూరు రూపురేఖలు మార్చేస్తానన్నారన్నారు. ఆయన రూపురేఖలు మారాయి అవినీతి సొమ్ముతో లావు అయ్యాడే తప్ప ప్రొద్దుటూరు రూపురేఖలు మారలేదన్నారు. పట్టుమని రూ.100 కోట్ల పనులు కూడా పూర్తి చేయలేని అసమర్థ ఎమ్మెల్యే అని పేర్కొన్నారు. టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు తీసుకోవద్దు వైసిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 సెంట్లలో ఒక్క రూపాయి తీసుకోకుండా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారని తెలిపారు. బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రజిని దొంగ నోట్లు చలామణి చేస్తూ కర్ణాటకలో పట్టుబడ్డారని, దీని వెనుక ఉన్న దొంగనోట్ల డాన్ బెట్టింగ్ ప్రసాద్ అని పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో ఏ వ్యాపారం చేసినా ఆయనకు కప్పం కట్టాల్సిందేనన్నారు. ఈయన దెబ్బకి వ్యాపారస్తులు అందరూ వణికిపోతున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తానని చెప్పి, జాబ్‌లెస్ కేలండర్ విడుదల చేశారన్నారు. తీవ్ర నిరాశ, నిస్పహలకు గురైన 470 మంది యువతీ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రూ.3 వేల నిరుద్యోగ భతి ప్రకటించారన్నారు. దీనిని అమలుచేసి తీరుతామన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలతో ప్రతిఏటా జాబ్ కేలండర్ విడుదలచేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పించి 20 లక్షల ఉద్యోగాలు కల్పన ద్వారా వలసలను నివారిస్తామని చెప్పారు. కులాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకోవడం జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. న్యాయమైన డిమాండ్లతో పోరాటం చేస్తున్న బేడ/బుడగ జంగాలకు అండగా నిలుస్తామని తెలిపారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. స్థానిక సంస్థల నిధులను పక్కదారి పట్టించడంతో మున్సిపాలిటీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా నిధుల్లేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. స్వచ్చందంగా పనిచేసే ఆర్యవైశ్య సభలను సైతం జగన్ ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఏ సామాజికవర్గం ప్రశాంతంగా జీవించే పరిస్థితులు లేవని తెలిపారు. వివిధ చేతివత్తుల వారి ఉపాధిని దెబ్బతీశారని తెలిపారు. ముస్లిం మైనారిటీల ఆస్తులపై ఉన్న శ్రద్ధ వారి సంక్షేమంపై లేదన్నారు. మైనారిటీలకు చెందిన వేల కోట్ల రూపాయల వక్ఫ్ మసీదుల ఆస్తులను వైసిపి నేతలు దోచుకున్నారని విమర్శించారు. విధ్వంక పాలకుడు జగన్ బాటలోనే స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు నడుస్తున్నారన్నారు. తన స్వార్థం కోసం వందలాది మందికి ఉపాథి కల్పించే మార్కెట్‌ను కూలదోయడం దారుణమని తెలిపారు. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి పేద ముస్లింలకు ఆర్థికంగా చేయూతనిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులురెడ్డి, జిల్లా అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, టిటిడి మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ బిటెక్ రవి, నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు










