Mar 16,2023 22:20

సమావేశంలో మాట్లాడుతున్న పల్లె రఘునాథరెడ్డి

పుట్టపర్తి అర్బన్‌ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్రను విజయవంతం చేద్దామని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక టిడిపి కార్యాలయంలో పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ వైసిపి అసమర్థ పాలనను ప్రజలకు వివరిస్తూ లోకేష్‌ 400 రోజులు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర యువగళం పేరుతో చేపట్టారన్నారు. చరిత్రలో ఇంతవరకు 4వేల కిలోమీటర్ల పాదయాత్ర ఎవరు చేయలేదన్నారు. ఈనెల 17న పాదయాత్ర సత్యసాయి జిల్లాలో ప్రారంభమవుతుందన్నారు. తనకల్లు, నల్లచెరువు, కదిరి మండలాల మీదుగా పాదయాత్ర 21న పుట్టపర్తి నియోజకవర్గంలోకి చేరుతుందన్నారు. ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున తెలుగు యువత, నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
నియోజకవర్గంలో లోకేష్‌ పాదయాత్ర షెడ్యూల్‌
కదిరి మండలం నుంచి ఈనెల 21 మధ్యాహ్నం 2:30 గంటలకు నల్లమాడ మండలం పులగం పల్లికి పాదయాత్ర చేరుతుందన్నారు. భోజన విరామం తర్వాత వణుక వారి పల్లి వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. ఉగాది పండుగ కారణంగా 21వ తేదీ రాత్రి హైదరాబాదుకు లోకేష్‌ బయలుదేరి వెళ్తారన్నారు. పండుగ విరామం తర్వాత 25 ఉదయం నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభం అవుతుందన్నారు. అక్కడి నుంచి గాజుకుంటపల్లి నుండి ఓడిసికి చేరుకుంటుందని అక్కడ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. ఆ రాత్రి రామయ్యపేటలో బస చేస్తారన్నారు. 26న ఉదయం బయలుదేరి మహమ్మదాబాద్‌ క్రాస్‌ చేరుకుంటారన్నారు. అక్కడ వడ్డెర్లతో సమావేశమవుతారన్నారు. అల్లాపల్లి మీదుగా గోరంట్ల మండలంలోకి ప్రవేశిస్తారు అన్నారు. గోరంట్ల మీదుగా పాలసముద్రం క్రాస్‌ నుంచి సోమందేపల్లి, పెనుకొండ మీదుగా పాదయాత్ర సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి మండల కన్వీనర్‌ రామాంజనేయులు, కొత్తచెరువు కన్వీనర్లు రామకృష్ణ, శ్రీనివాసులు, బుక్కపట్నం కన్వీనర్‌ మల్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బెస్త చలపతి, నాయకులు శ్రీరామ్‌ రెడ్డి, సామకోటి ఆదినారాయణ, అంబులెన్స్‌ రమేష్‌, పుల్లప్ప, సయ్యద్‌బాషా, దారపనేని చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
కనగానపల్లి : రేపటి నుంచి సత్యసాయి జిల్లాలోకి ప్రవేశించనున్న టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని టిడిపి మండల కన్వనర్‌ యాతం పోతలయ్య, రాష్ట్ర కార్యదర్శి నెట్టెం వెంకటేష్‌ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీమంత్రి పరిటాల సునీత సూచన మేరకు ప్రతి గ్రామ నుంచి కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొనాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిటిసి బిల్లే భాస్కర్‌, సీనియర్‌ నాయకులు సుధాకర్‌చౌదరి, బాల నరసింహులు, శంకర్‌రెడ్డి, రాజకృష్ణ, దేవరాజు, బిల్లే దాము, తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్‌ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని టిడిపి నాయకులు ఎద్దులపల్లి హరి గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నారా లోకేష్‌ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈనేపథ్యంలో నేడు జిల్లాలోకి ప్రవేశించనున్న పాదయాత్రలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
నల్లచెరువు : నారా లోకేష్‌ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో భాగంగా విడిది, సభా ప్రాంగణాల ఏర్పాట్లను కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌, టిడిపి ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ గురువారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ రాజశేఖర్‌, మురళి, తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.