న్యూఢిల్లీ: ఆదివారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ 5వ దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 12జిల్లాలోని ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రామ జన్మభూమి అయోధ్య సహా 61 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ జరుగున్నది. ఈ రోజు ఉదయం 7గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు జరిగే పోలింగ్ లో 2.25 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అమేథి, రాయ్‌బరేలి, సుల్తాన్‌పూర్, చిత్రకూట్, ప్రతాప్‌గఢ్, కౌశంబి, ప్రయాగ్‌రాజ్, బారాబంకి, అయోధ్య, బహరిచ్, స్రవస్తి, గోండా నియోజకవర్గాలలో బిజెపికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దీనిని మిగిలిన పార్టీలు అందిపుచ్చుకొని ప్రచారం సాగించారు. ఈ నియోజక వర్గాలలో దళితులు, ముస్లింలే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. సిరాథూ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న యుపి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు మంత్రులు సిద్ధార్థ్ నాథ్ సింగ్, నందగోపాల్ గుప్తా, రామపతి శాస్త్రిలు ఎన్నికల బరిలో ఉన్నారు. పశ్చిమ యుపిలో రైతు ఆందోళనలు బిజెపిని ఇరకాటంలో నెట్టేస్తే, అయిదో దశలో పశువులు ఇష్టారాజ్యంగా పొలాల్లోకి వచ్చి పంటల్ని నాశనం చేయడం యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ విస్తృతంగా ప్రచారం చేశాయి.










