Nov 06,2020 07:06

       మోడీ అధికారం లోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేనంతగా కార్మిక వర్గం మీద రెండు విధాల దాడి జరుగుతోంది. మొదటిది, భారత ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాల వంటి ప్రభుత్వ రంగ సంస్థలను 'అయిన' వాళ్లకు అప్పగించటం. రెండవది, కార్మిక వర్గ స్వతంత్ర రాజకీయ అస్తిత్వాన్ని, కార్మిక వర్గ సంఘటిత పోరాట శక్తిని నిర్వీర్యం చేయటం. ఈ పరిస్థితి గత ఆరేళ్ళ కాలంలో మరింత ఉధృతంగా ముందుకు వచ్చింది. దీనికి వ్యతిరేకంగా కార్మికవర్గం దేశవ్యాప్తంగా సమ్మె సైరన్‌ మోగిస్తోంది. ఈ సమ్మెలో విద్యుత్‌ రంగ ఉద్యోగులు, కార్మికులు కీలక పాత్ర పోషించనున్నారు.
                                                      ప్రైవేటీకరణను తిప్పికొట్టిన యు.పి ఉద్యోగులు
       ఉత్తరప్రదేశ్‌ విద్యుత్‌ రంగ ఉద్యోగులు, కార్మికులు విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించకుండా జరిపిన పోరాటంలో విజయం సాధించారు. పూర్వాంచల్‌ విద్యుత్‌ పంపిణీ కంపెనీని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలను అడ్డుకున్నారు. రాష్ట్రంలోని విద్యుత్‌ ఉద్యోగ సంఘాలన్నీ 'ఐక్య కార్మిక సంఘటన'గా ఏర్పడి దశలవారీ ఉద్యమం చేయటంతో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం దూకుడుకు కళ్లెం వేశారు. ఈ ఉద్యమంలో 15 లక్షల మంది విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. ఆగష్టు 24వ తేదీ నుండి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలకు ఐక్య సంఘటన పిలుపునిచ్చింది. సెప్టెంబర్‌ 28న భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా చేసిన కొవ్వొత్తుల ప్రదర్శనలపై యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయెగించింది. వందల మందిని అరెస్టులు చేసి కేసులు పెట్టింది. ఉద్యోగులు, కార్మికులు సెప్టెంబర్‌ 29న మూడు గంటలపాటు విధుల బహిష్కరణకు దిగారు. అక్టోబర్‌ 5వ తేదీ నుండి నిరవధిక విధుల బహిష్కరణకు ఐక్య సంఘటన పిలుపునిచ్చింది. సమ్మెను విచ్ఛిన్నం చేయటానికి పోలీసు బలగాలను, సైన్యాన్ని యోగి ప్రభుత్వం మోహరింపచేసింది. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ కోసం ఎన్‌టిపిసి, బిహెచ్‌ఇఎల్‌ వంటి వివిధ సంస్థల నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఇంజనీర్లను నియమించింది. అయినా ప్రభుత్వ చర్యలన్నీ విఫలం అయ్యాయి. యోగి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అక్టోబర్‌ 6న ఐక్య సంఘటనతో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. పూర్వాంచల్‌ విద్యుత్‌ పంపిణీ కంపెనీ ప్రవేటీకరణను విరమించుకోవటం, తూర్పు ఉత్తరప్రదేశ్‌ లోని 5 డివిజన్లలో విద్యుత్‌ పంపిణీని పూర్వాంచల్‌ డిస్కం ద్వారానే చేయటం, విద్యుత్‌ పంపిణీ సేవలను మెరుగు పరిచేందుకు ఉద్యోగులు, అధికారులు, సిబ్బందిని మరింత విశ్వాసం లోకి తీసుకోవటం, భవిష్యత్‌లో సిబ్బందిని సంప్రదించకుండా ప్రైవేటీకరణ ప్రయత్నాలను చేయకుండా వుండటం, సమ్మె కాలంలో కార్మికులు, ఉద్యోగులపై పెట్టిన అన్ని రకాల కేసులను ఉపసంహరించటం వంటి ప్రధాన డిమాండ్లను యోగి ప్రభుత్వం అంగీకరించింది.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో విద్యుత్‌ రంగ సంస్కరణలను అడ్డుకున్న ఘన చరిత్ర మనకు ఉన్నది. 1999-2001 మధ్యలో జరిగిన అనేక ఉద్యమాల ఫలితంగా సంస్కరణల వేగానికి అడ్డుకట్ట వేయగలిగాము. ఈ స్ఫూర్తితోనే మోడీ ప్రభుత్వం తీసుకురానున్న విద్యుత్‌ సంస్కరణలను నిలువరించాలి.
                                                  విద్యుత్‌ సవరణ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకించాలి ?
           విద్యుత్‌ సవరణ చట్టం-2020ని తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితిల్లోను అమలు చేయబోమని ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. కాని మన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు నోరు మెదపలేదు. కేవలం ఇంధన కార్యదర్శి కేంద్రానికి ఒక లేఖ రాసి సరిపుచ్చుకున్నారు. విద్యుత్‌ చట్ట సవరణలు అమలైతే ఉత్పత్తి, సరఫరా, పంపిణీలు కేంద్రం చేతిలోకి పోతాయి. డిస్కంలను ప్రవేటీకరించాలని అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కేంద్రం కోరింది. మొదట డిస్కంలను ప్రవేటీకరించటం... అనంతరం ట్రాన్స్‌మిషన్‌ జెన్కో స్టేషన్లను ప్రైవేటు కార్పొరేట్లకు కట్టబెట్టడం కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ఇదే జరిగితే విద్యుత్‌ సంస్థ లోని ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో పని చేస్తున్న పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌, పీస్‌ రేట్‌ కార్మికుల ఉపాధి, ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. తక్షణం కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల ఉద్యోగాలు ఊడిపోవటం ఖాయం. కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న విద్యుత్‌ సవరణ చట్టం రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించి వేయనుంది. విద్యుత్‌ ఇప్పడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో వుంది. కేంద్రం, రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా చట్టాలు చేసుకోవచ్చు. ప్రతిపాదిత విద్యుత్‌ సవరణ చట్టం-2020 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాలకు అనుగుణంగా చట్టాలు చేసుకునే అవకాశం కోల్పోతాయి. ప్రస్తుత విధానంలో ప్రైవేటు సంస్థలు విద్యుత్‌ను ఉత్పత్తి చేసినా పిపిఏ ల ద్వారా రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు అమ్మవలసిందే. నేరుగా వినియోగదారులకు విద్యుత్‌ను అమ్ముకునే స్వేచ్ఛ లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్ట సవరణలు అమలులోకి వస్తే ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్థలలో ఉత్పత్తి చేసే విద్యుత్‌ను దేశం లోని పారిశ్రామికవేత్తలకు, వ్యాపార సంస్థలకు నేరుగా అమ్ముకోవచ్చు. విద్యుత్‌ ఉత్పత్తి చేెసిన చోటనే అమ్ముకోనవసరం లేదు. దేశంలో ఎక్కడ ఉత్పత్తి చేసినా ట్రాన్స్‌కో లైన్ల ద్వారా సరఫరా చేసి తమకు అనుకూలంగా ఉన్న చోట విద్యుత్తును తీసుకోవచ్చు. దీనికి నామమాత్రంగా వీలింగ్‌ చార్జీలు చెల్లిస్తే చాలు. ఈ చట్ట సవరణలు అమల్లోకి వస్తే ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలు దివాళా తీస్తాయి. విద్యుత్‌ వ్యవస్థే ధ్వంసమవుతుంది. రాష్ట్రం పరిధిలో ఇప్పటివరకు ''స్టేట్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌'' విద్యుత్‌ను రెగ్యులేట్‌ చేస్తుంది. కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. కేంద్ర చట్టం అమల్లోకి వస్తే...రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్‌కు ఎటువంటి అధికారాలు వుండవు. డిస్కంలు తమ అవసరాలకు అనుగుణంగా పిపిఏలు చేసుకొనే అధికారం ఉండదు. కేంద్ర ప్రభుత్వం బడా కార్పొరేట్లు అయిన అదానీ, అంబానీలతో ఒప్పందాలు చేసుకుంటుంది. రైతులకు, పేదలకు ఇచ్చే సబ్సిడీలు, రాయితీలు పోతాయి. ఇందులో భాగంగానే వ్యవసాయ మోటర్లకు డిజిటల్‌ మీటర్లు బిగిస్తారు. ఈ సంస్కరణల వలన సబ్‌స్టేషన్లు మానవరహిత ఆటోమిషన్‌ స్టేషన్లుగా మారతాయి. సబ్‌ స్టేషన్లలో పని చేస్తున్న కార్మికులు ఉద్యోగాలు కోల్పోతారు. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న జెన్‌కో స్టేషన్లు మూతపడే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆర్‌టిపిపి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పీస్‌ రేటు కార్మికులైన మీటర్‌ రీడర్లు, బిల్‌ కలెక్షన్‌ ఏజెంట్లు, ఎస్‌పిఎం కార్మికుల, హమాలీల పని దినాలు తగ్గించడం ప్రారంభం అయింది. డిజిటల్‌ మీటర్లు, డిజిటల్‌ పేమెంట్ల వల్ల వీరి ఉపాధి పోతుంది.
                                                       దశలవారీ ఆందోళనలకు పిలుపు
          మన రాష్ట్రంలో విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా...ఉద్యోగుల జిపిఎఫ్‌, డిఏ వంటి సమస్యలతో పాటు కాంట్రాక్ట్‌ కార్మికుల రెగ్యులరైజేషన్‌ వంటి డిమాండ్ల సాధనకు... విద్యుత్‌ రంగం లోని 31 యూనియన్లు కలసి ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జెఏసి గా ఏర్పడ్డాయి. అక్టోబర్‌ 19 నుండి నవంబర్‌ 16 వరకు 3 దశలలో నల్ల బ్యాడ్జీల నిరసనలు, భోజన విరామ సమయంలో నిరసనలు, రిలే నిరాహారదీక్షలు వంటి కార్యక్రమాలకు పవర్‌ జెఏసి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 28వ తేదీన విద్యుత్‌ శాఖ మంత్రి సమక్షంలో యాజమాన్యం పవర్‌ జెఏసి మధ్య చర్చలు జరిగాయి. జెఏసి ప్రతిపాదించిన డిమాండ్లపై నిర్దిష్టమైన హామీ రాలేదు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో దళారి వ్యవస్థను రద్దు చేసి సంస్థనే కార్మికులకు నేరుగా మెరుగైన వేతనాలు ఇస్తున్నది. మన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్ట్‌ కార్మికుల డిమాండ్లపౖౖె ఇప్పటికే ఉన్న పుల్లారెడ్డి కమిటీ సిఫార్సులను, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను పరిగణ లోకి తీసుకోవచ్చు. ఇవేవీ పట్టించుకోకుండా లీగల్‌ ఒపీినియన్‌ పేరుతో పరిశీలిస్తామని చెప్పటం అంటే కాంట్రాక్టు ఉద్యోగులను మోసం చేయటమే. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను విస్మరించటమే అవుతుంది. 
         సంస్థ పరిరక్షణ కోసం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికుల డిమాండ్ల సాధన కోసం...ఎ.పి పవర్‌ జెఏసి సమరశీల పోరాటాల దిశగా కదలాలి. నవంబర్‌ 16 నుండి సమ్మె అనివార్యమైతే మొక్కవోని దీక్షతో ముందుకు సాగాలి. మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు నవంబర్‌ 26న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి.

(వ్యాసకర్త రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌, సెల్‌ : 9490098056)

ఎం. బాలకాశి