Feb 17,2023 20:10

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

ప్రజాశక్తి-రాయచోటి: నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న ఇళ్ల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరీష ఎంపిడిఒలు, గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి జగనన్న హౌసింగ్‌ ఇళ్ల నిర్మాణాలు, గడప గడపకూ మన ప్రభుత్వం, జగనన్న స్వచ్ఛ సంకల్పం, బిఎంసియులు, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ విసి ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు సంబంధిత అధికారులు అందరూ కృషి చేయాలన్నారు. ఇండ్ల నిర్మాణాలలో ప్రతి వారం దశల వారీగా స్టేజ్‌ కన్వర్షన్‌ జరగాలని సూచించారు. వారంలో మూడు రోజులు ఎంపిడిఒలు, హౌసింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కేటాయించిన లక్ష్యంలో ప్రగతి సాధించాలన్నారు. జగనన్న హౌసింగ్‌ కాలనీల నిర్మాణ పనుల్లో పురోగతి సాధించాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. లే అవుట్‌లలో నీటి సౌకర్యం, విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాన్ని ప్రతి ఒక్కరూ సీరిరుసగా తీసుకుని లేఅవుట్‌ వారీగా ఇచ్చిన లక్ష్యాలను అధిగమించాలన్నారు. ఇంకా ప్రారంభంకాని ఇళ్లన్నీ సత్వరమే ప్రారంభించి పునాది స్థాయికి తీసుకురావాలన్నారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు ఒక్కో లబ్ధిదారునికి రూ.35 వేలు రుణం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని డిఆర్‌డిఎ పీడీని కలెక్టర్‌ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. జిల్లాలో ఎస్‌డబ్ల్యూపిసి షెడ్లు దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో భాగంగా వాటర్‌, నేమ్‌ బోర్డు, రోడ్డు ఏర్పాట్లు పెండింగ్‌ లేకుండా పూర్తి చేయాలన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన పనులన్నీ గ్రౌండ్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చేసిన పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు బిల్స్‌ ఆన్‌లైన్‌లో అప్లోడ్‌ చేయాలని ఎంపిడిఒలకు సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలలో వేగం పెంచి గడువులోగా లక్ష్యాలను పూర్తి చేసేందుకు ఇంజినీర్‌లు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్య భవనాల నిర్మాణంలో స్పష్టమైన పురోగతి కనిపించాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బిఎంసియు, నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డిపిఒ ధనలక్ష్మి, హౌసింగ్‌ పీడీ శివయ్య, ఆర్డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ ప్రసన్నకుమార్‌, డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, పిఆర్‌ ఎస్‌ఇ సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.