ప్రజాశక్తి గోరంట్ల : పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వెనుక వైపు ఉన్న ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైంది. సర్వే నెంబర్ 271/2 లో మూడు ఎకరాలు ప్రభుత్వ స్థలంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని 2010లో లేఅవుట్ వేశారు. అయితే స్థానిక వైసీపీ నాయకుడి అండతో స్వార్థపరులు కోట్లాది రూపాయలు విలువగల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. వైసిపి నాయకులు దగ్గరుండి జెసిబి తో పునాదులు వేయిస్తున్నారు. ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. గతంలో ఈ స్థలంలో ఆర్మీ జవాన్లకు పట్టాలు మంజూరు చేశారు. ఈ నేపథ్యంతో తమ స్థలాలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆర్మీ జవాన్ మధుసూదన్ రెడ్డి సోమవారం స్థానిక తహశీల్దార్ రంగనాయకులకు వినతి పత్రం అందజేశారు అలాగే నరసింహులు అనే వ్యక్తి తనకు 2013లో ఇంటి పట్టా మంజూరైందని అయితే ప్రస్తుతం ఆస్థలంలో దౌర్జన్యంగా పునాదులు వేస్తున్నారని తన స్థలానికి రక్షణ కల్పించాలని బాధితుడు తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు స్థలం భూ కబ్జాపై తహశీల్దార్ రంగనాయకులును వివరణ కోరగా కార్యాలయం సెలవు రోజు ఆదివారం నాడు ప్రభుత్వ స్థలంలో జెసిబి తో పునాదులు వేశారని ఆ స్థలం ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.










