ప్రజాశక్తి - పరిగి : మండల వ్యాప్తంగా కల్తీకల్లు దుకాణాలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. అధికారులు మాత్రం నామమాత్రపు దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి. ఉగాది పండుగను పురస్కరించుకొని విచ్చలవిడిగా కల్తీకల్లు తయారు చేసి గ్రామాలకు తరలిస్తున్నారన్న సమాచారంతో శుక్రవారం ఉదయం ఎక్సైజ్ అధికారి అన్నపూర్ణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. కొడగేనహళ్లి గ్రామ శివార్లలో ఒక ఇటుకల పట్టి వద్ద పెద్ద ఎత్తున కల్లు తయారు చేసి అక్కడినుండి శ్రీరంగరాజుపల్లి, శాసనకోట, మోద, ఇలా పలు ప్రాంతాలకు వాహనాల్లో సరఫరా చేస్తున్నారు. ఈ విషయం స్థానికుల వల్ల తెలుసుకొన్న అధికారులు దాడులు నిర్వహించారు. అయితే అక్కడికక్కడే కల్లు శాంపిల్స్ ను పరిశీలించినప్పటికీ ఫలితం తేలలేదని అందువల్ల చిత్తూరులోని ల్యాబ్‌కు ఈ కల్లు పంపి అనంతరం డిపో చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారి తెలిపారు.
నామమాత్రపు దాడులు : అయితే ఇలాంటి దాడులు తాత్కాలికమైననే ఇటీవలే పలు గ్రామాలలో కల్లు తాగి రోగాల బారిన పడుతున్నారని ఇది కచ్చితంగా కల్తీ కల్లే అని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. హిందూపురానకి చెందిన ఒక వ్యక్తి కొడిగినహళ్లి కేంద్రంగా కల్లు డిపోను ఏర్పాటు చేసి ఇక్కడి నుండే కల్తీకల్లు తయారు చేసి అన్ని గ్రామాలకు సరఫరా చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అధికారులు కల్తీ కల్లు పరీక్షలు చేయడం నామమాత్రంగా జరుగుతోందన వారు విమర్శిస్తున్నారు. ఈ కల్లు తాగిన వారు అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నారని దళిత సమైక్య జిల్లా అధ్యక్షులు నారాయణ అన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించలేదని విమర్శించారు. ఇప్పుడు డిపో ను మూసి వేయించాల్సిన అధికారులు కల్తీకల్లును తీసుకెళ్లి చిత్తూరు ల్యాబ్లో పరీక్ష నిర్వహిస్తామని అనడం ముమ్మాటికీ వారి వైఫల్యమేనని అన్నారు. మండలంలో అనుమతులు లేకుండా వీధికొక కల్లు దుకాణాన్ని ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారని గ్రామీణ ప్రాంతాల్లో మెరుపు దాడులు చేస్తే తప్ప నిర్వాహకులు దొరికే అవకాశం లేదని అన్నారు. ఒక లైసెన్స్ తో పదుల సంఖ్యలో దుకాణాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు ఈ దుకాణాలను మూసి వేయించాలని లేకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.










