ప్రజాశక్తి-విజయవాడఅర్బన్: యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. విజయవాడలోని సిద్ధార్థ లారీటోరియంలో రెండో రాష్ట్రస్థాయి యోగాసన ఛాంపియన్ షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. యోగా ప్రాముఖ్యతను నేటి తరం విద్యార్థులకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మెదడు, శరీరాన్ని కలిపేదే యోగ అని కొనియాడారు. ప్రపంచంలోని చాలా దేశాలు యోగాని ఆచరిస్తున్నాయన్నారు.. నిత్యమూ యోగా చేసేవారు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమానికి 26జిల్లాల నుంచి సుమారు 250మంది విద్యార్థులు హాజరయ్యారు. చిన్నారులు చేసిన యోగాసనాలు, నృత్యం పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు రాధిక, జిల్లా అధ్యక్షులు కొంగర సాయి, చత్తీస్‌ఘడ్ మాజీ డీజీపి మండవ వెంకటేశ్వరరావు, కృష్ణాజిల్లా ప్రెసిడెంట్ పర్వతనేని ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.










