న్యూఢిల్లీ : ఢిల్లీలో యమునా నది నీటి మట్టం బుధవారం ఉదయం మరోసారి ప్రమాదకరస్థాయిని దాటింది. ఢిల్లీలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో యమునా నదికి వరద పోటెత్తింది. బుధవారం ఉదయం 8 గంటలకు నీటిమట్టం 205.48 మీటర్లకు చేరుకుందని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది. సాయంత్రం 6 గంటల సమయానికి 205.72 మీటర్లకు పెరగవచ్చని అంచనా వేసింది. గతవారం యమునా నది నీటిమట్టం 208.66మీటర్లకి చేరి ఆల్‌టైం గరిష్టంగా నమోదైన సంగతి తెలిసిందే.
గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన నదీ ప్రవాహం.. మంగళవారం మధ్యాహ్నం నుండి స్వల్పంగా పెరిగింది. మంగళవారం హత్నికుండ్ బ్యారేజీ వద్ద ప్రవాహ రేటు స్వల్పంగా పెరిగి 50,000 నుండి 60,000 క్యూసెక్కులకు చేరింది. బుధవారం ఉదయం 7 గంటల సమయానికి సుమారు 39,000 క్యూసెక్కులకుపడిపోయింది. ఒక క్యూసెక్ అంటే సెకనుకి 28.32 లీటర్లు. జులై 22 వరకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.










