జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరి
ప్రజాశక్తి-వీరబల్లి : సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరి అన్నారు. గురువారం మండలంలోని పెద్దవీడు పంచాయతీ రెడ్డివారిపల్లి రైతులకు వేరుశనగ పంట పొలంలో పొలంబడి కార్యక్రమంపై అవగాహన కల్పించారు. క్లస్టర్ లెవెల్ పొలంబడి కార్యక్రమంలో భాగంగా అగ్రికల్చర్ ఆఫీసర్ స్వాతి ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ హాజరై రైతుల పొలంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వేరుశనగ విత్తనం విత్తేముందు నుంచి విత్తనం తయారయ్యే వరకు రైతు అవలంబించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించి తక్కువ పెట్టు బడితో, ఎక్కువ దిగుబడులు సాధించేటట్లు అవగాహన కల్పించారు. ఇటువంటి పొలంబడి కార్యక్రమం ప్రతి గురువారం రైతు పొలంలో జరుగుతుందని తెలిపారు. బృందాలుగా ఏర్పడి వారు పంటను పరిశీలించి, నేల, మొక్క, ఆరోగ్య స్థితి కలుపు మొక్కలు పురుగు తెగుళ్లు వాతావరణం వాటిపై రైతులకు సూచనలు, సలహాలు ఇస్తారు. ఇచ్చిన సలహాలు సూచనలు అమలు చేస్తే రైతులకు దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో రైతుల స్వయంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. పకృతి వ్యవసాయానికి, రసాయన వ్యవసాయానికి తేడా ఇంకా మెరుగైన పద్ధతులు పాటించడానికి సామూహికంగా రైతులు పకృతి వ్యవసాయం చేయడానికి సులభతరం అవుతుందన్నారు. ఈ మూడు సీజన్లకు సంబంధించి మేలైన యాజమాన్య పద్ధతుల పాటించి పంట సాగు చేసిన రైతులకు జిఎపి సర్టిఫికెట్ ఇస్తారని దీనివలన వారు పండించిన దిగుబడులకు అధిక గిట్టుబాటు ధరలు పొందవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో ఎఒఎలు శ్రీకాంత్, సావిత్రి, ఎఒలు రమేష్ రాజు, మల్లికా, వీరబల్లి వ్యవసాయ శాఖ అధికారి స్వాతి, ఎఇఒ షణ్ముగం, అన్ని గ్రామాల రైతులు, ఆర్‌బికె సిబ్బంది, పాల్గొన్నారు.










