ప్రజాశక్తి వీరబల్లి: సరైన యాజనమ్యా పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఉమామహేశ్వరమ్మ అన్నారు. గురువారం మండలంలోని పెద్దవీడు పంచాయతీ రెడ్డివారిపల్లి, సంఘమండపల్లి రైతులకు వేరుశనగ పంట పొలంలో పొలంబడి కార్యక్రమంపై వ్యవసాయాధికారి స్వాతి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఉమామహేశ్వరమ్మ రైతుల పొలంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేరుశనగ విత్తనం విత్తే ముందు నుంచి విత్తనం తయారయ్యే వరకు రైతు అవలంబించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. తక్కువ పెట్టు బడితో ఎక్కువ దిగుబడులు సాధించేటట్లు అవగాహన కల్పించారు. ఇటువంటి పొలంబడి కార్యక్రమం ప్రతి గురువారం రైతు పొలంలో జరుగుతుందని తెలిపారు. బృందాలుగా ఏర్పడి వారు పంటను పరిశీలించి, నేల, మొక్క, ఆరోగ్య స్థితి కలుపు మొక్కలు పురుగు తెగుళ్లు వాతావరణం వాటిపై రైతులకు సూచనలు, సలహాలు ఇస్తారు. ఇచ్చిన సలహాలు సూచనలు అమలు చేస్తే రైతులకు దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో రైతుల స్వయంగా తెలుసుకోవచ్చు అన్నారు. పక తి వ్యవసాయానికి, రసాయన వ్యవసాయానికి తేడా ఇంకా మెరుగైన పద్ధతులు పాటించడానికి సామూహికంగా రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడానికి సులభతరం అవుతుందన్నారు. ఈ మూడు సీజన్లకు సంబంధించి మేలైన యాజమాన్య పద్ధతుల పాటించి పంట సాగు చేసిన రైతులకు జిఎపి సర్టిఫికెట్ ఇస్తారని దీనివలన వారు పండించిన దిగుబడులకు అధిక గిట్టుబాటు ధరలు పొందవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో ఎఒఎలు శ్రీకాంత్, సావిత్రి, ఎఒలు రమేష్ రాజు, మల్లికా, వీరబల్లి వ్యవసాయ శాఖ అధికారి స్వాతి, ఎఇఒ షణ్ముగం, నాగేంద్ర, నవీన్ అన్ని గ్రామాల రైతులు, ఆర్‌బికె సిబ్బంది, పాల్గొన్నారు.










