డొమినికా: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా బుధవారం నుంచి ప్రారంభమైన తొలి టెస్ట్‌లో భారత బౌలర్లు రాణించారు. ఆట తొలిరోజు విండీస్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. జైశ్వాల్ 40, రోహిత్ శర్మ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 70 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు టీమిండియా స్పిన్నర్లు అశ్విన్, జడేజాల ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్ తరఫున అలీక్ అత్యధికంగా 47 పరుగులు చేశాడు. 99 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. కెప్టెన్ బ్రైత్‌వైట్ కేవలం 20 పరుగులకే ఔటయ్యాడు. తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ 12 పరుగులు చేసి వెనుదిరిగాడు. చివర్లో కార్న్‌వాల్ 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టగా.. జడేజా మూడు వికెట్లు, సిరాజ్, శార్దూల్‌లు చెరొక వికెట్ తీశారు.










