- భూగర్భ జలాల డేంజర్ బెల్
ప్రజాశక్తి-నందిగామ : నందిగామ పట్టణంలో కొద్ది రోజులుగా భూగర్భ జలాలు డేంజర్ బెల్ మోగిస్తున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం నందిగామ నగర పంచాయతీ పరిధిలో మొత్తం 15,957 గృహాలు ఉన్నాయి. వీటిలో 105 బహుళ అంతస్తుల భవనాలున్నాయి.
దీనిలో భాగంగా రైతు పేట అపార్ట్మెంట్ వాసులకు గత నెల రోజుల నుండి వాడుకోవడానికి నీళ్లు లేక విల విలలాడుతూ ప్రైవేట్ ట్యాంకర్లతో కొనుగోలు చేసుకుంటున్నారు.
ఒక్కో అపార్ట్ మెంట్ కు రోజుకు రెండు నుంచి మూడు ప్రైవేట్ ట్యాంకర్లు నీరు సరఫరా చేస్తున్నాయి.ఒక్కో ట్యాంకర్ రెండు నుండి మూడు వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్న అపార్ట్మెంట్ వాసులు పెను భారం అవుతుందని అపార్ట్మెంట్ వాసులు వాపోతున్నారు.
నందిగామ నగర పంచాయతీ పరిధిలో సీఎం రోడ్డు, రైతు పేటలో, భాను ప్రసాద్ హాస్పిటల్ రోడ్డు, ఎన్టీఆర్ రోడ్డు, గీతా మందిరం రోడ్డు, చైతన్య ఏసి క్యాంపస్ రోడ్డు, కాకతీయ స్కూల్ రోడ్లో అపార్ట్మెంట్ వాసులకు ఈ వేసవి కాలంలో వాడుకోడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కనీసం స్నానానికి కూడా నీరు లేక మూడు రోజులకు ఒకసారి స్నానం చేయవలసి వస్తుందని అపార్ట్మెంట్ వాసులు వాపోతున్నారు.
నందిగామ నగర పంచాయతీలో జి ప్లస్ టు మాత్రమే అనుమతులు ఉన్నాయి. అలాంటిది బిల్డర్లు మాత్రం జి ప్లస్ టు కు అనుమతులు తీసుకుని జి ప్లస్ ఫైవ్ నిర్మాణాలు చేపడుతున్నారు. కొనుగోలు చేసేటప్పుడు మధ్యతరగతి ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తామని మాయమాటలు చెప్పి ఫ్లాట్లను అమ్ముకొని తర్వాత మొహం చాటేస్తున్నారు. ఒక్కో అపార్ట్మెంట్ లో బోర్లుంటాయి కానీ దానిలో నీరు పది కుటుంబాలకు మాత్రమే సరిపోతుంది. కానీ ఒక్క అపార్ట్మెంట్లు 20 నుంచి పాతిక కుటుంబాలు నివాసం ఉండటంతో బోర్లలో నీరు అడుగంటి పోవడంతో అపార్ట్ మెంట్ వాసులు నీరు సరిపోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికే అపార్ట్మెంట్లో అద్దెలకు ఉన్నవారు 90 శాతం మంది అపార్ట్మెంట్ లు ఖాళీ చేశారు.
ఈ అపార్ట్మెంట్లు మాకు వద్దు బాబు అంటున్నారు. కొనుగోలు చేసిన వాళ్లకు అద్దెలు కూడా రాకపోవడంతో బ్యాంకు లోన్ ఎలా తీర్చాలని తలలు పట్టుకుంటున్నారు. బిల్డర్ల మాయమాటలకు వలలో పడి మధ్యతరగతి ప్రజలు అనుమతులు లేని ఫ్లాట్లు కొనుగోలు చేసి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ఇప్పుడు మరో 20 అపార్ట్మెంట్లు జి ప్లస్ టు అనుమతులు తీసుకుని జి ప్లస్ ఫైవ్ నిర్మాణాలు చేపడుతున్నా మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తైనా చూడటం లేదు వారికి రావాల్సిన మాముళ్ళు వారికి రావడంతో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు నిర్మోహమాటంగా చెప్పుకుంటున్నారు.
ఒక్కో అదనపు ఫ్లోర్ కి మూడు నుండి నాలుగు లక్షలు లంచం రూపంలో డబ్బులు చెల్లిస్తున్నామని బహిరంగంగానే బిల్డర్లు చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి అపార్ట్మెంట్ వాసులకు ఉచితంగా నీరు అందేలా చూడాలని, అదేవిధంగా మున్సిపల్ అధికారులు కళ్లు తెరిచి జి ప్లస్ ఫైవ్ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజా నాయకులు కూడా దీనిపై దృష్టి పెట్టాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.










