Oct 12,2023 09:00
  • వ్యవసాయ కార్మికుల ఆందోళనలు

ప్రజాశక్తి-యంత్రాంగం : ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న బిజెపి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికులు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆందోళనలు చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలని, పని దినాలు, వేతనాలు పెంచాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పేదలు, వ్యవసాయ కార్మికుల కోసం తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని, నామమాత్రంగా నిధులు కేటాయిస్తున్నాయని తెలిపారు. వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడంలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఉపాధి హామీకి నిధులు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఏలూరు జిల్లా ముదినేపల్లిలో ఎంపిడిఒ పి.మల్లీశ్వరిని వ్యవసాయ కార్మిక సంఘం నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్‌ మండలంలోని దువ్వ సచివాలయ కార్యదర్శి ఎస్‌వివి.నరసింహమూర్తికి వినతిపత్రం అందించారు. యలమంచిలి మండలం ఏనుగువానిలంక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉపాధి కార్మికులు నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండల కేంద్రంలో కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్‌ కూడలిలో ధర్నా చేపట్టారు. కర్నూలు జిల్లా ఆస్పరి, పెద్దకడబూరు, దేవనకొండ ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టి, ఎంపిడిఒలకు వినతిపత్రాలు అందజేశారు. కడప జిల్లా జ్యోతిరావు ఫూలే సర్కిల్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రకాశం జిల్లాలో ఉపాధి చట్టం రక్షణ కోసం సంతనూతలపాడు, మద్దిపాడు మండలం బసవన్నపాలెం, గాజులపాలెం గ్రామాల్లో ఉపాధి కార్మికులు ఆందోళనలు చేశారు.