Oct 06,2023 11:05
  • వైసిపి ప్రభుత్వానికి సిపిఎం హెచ్చరిక.
  • భావనపాడులో అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం
  • బీజేపీ విషకౌగిలిలోకి వెళ్లి పతనం కాకండి.
  • ముందు పోలవరం నిర్వాసితులకు పునరావాసం సంగతి తేల్చండి.
  • ప్రెస్ మీట్ లో సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి : పారదర్శ కత లేని పాలనతో వైసిపి ప్రభుత్వం అభాసుపాలవడం ఖాయమని సిపిఎం రాష్ట్ర కార్యద ర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. భావనపాడులో ప్రజా పోరాటాలపై పోలీసులు ఉక్కుపాదం మోపి, అక్రమ అరెస్టులకు పాల్పడటాన్ని ఖండిస్తున్నామని అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర యువ జన సదస్సు 3వ రోజు కార్యక్రమంలో భాగంగా నగరంలోని హెూటల్ రివర్ బే లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ గన్మోహన్ రెడ్డి గత రెండ్రోజులుగా ఢిల్లీలోని కేంద్ర మంత్రులను కలుస్తున్నారని అజెండా ఏమిటో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పడంలేదని మండిపడ్డారు. రాష్ట్ర  ప్రయోజనాల కోసం కలిశారా.? లేక స్వప్రయోజనాలకోసం బీజేపీతో కలిసారా ప్రజలకు చెప్పాలని అన్నారు. నాలుగు రోజుల క్రితం అదాని రాష్ట్రానికి వచ్చారని ఆ సమావేశం విషయాలను ఎందుకు వెల్లడించటంలేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కోసమా..? ఇసుక కాంట్రాక్టు అప్పగిస్తారా..? ఇలాంటి అనేక అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆన్నారు. ప్రభుత్వ జీవోలు సైతం గతంలో వెబ్సైట్లో అందుబాటులో ఉంచేవారని ప్రస్తుతం ఆ విదానానికి స్వస్తి పలకటమే కాకుండా ఎప్పుడైనా ఒక జీవో వెలుగులోకి వస్తే అధికారులను బాధ్యులను చేసి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సమాచార హక్కు చట్టంపైనా సమాధానాలు తెలపటం లేదని వివరించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఇసుక, మద్యం, బైజూస్, స్మార్ట్ మీటర్లకు టెండర్లు వంటివాటి వెనుక కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే వార్తలు వస్తున్నాయని ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపైనా స్పష్టమైన ప్రకటన చేయటంలేదని, భర్తీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. ఆరు నెలలో ప్రజలు పాలకులకు వాత పెట్టడం ఖాయం. పోలవరం నిధులు అడిగిన క్రమంలో పునరావాసా నికి ఎంత అడిగారని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణంలో పునరవాసమే కీలకమైందని ప్రతి పైసా పునరావా సానికే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల బిల్లుల కోసం నిధులు వెచ్చించడం ఎంతమాత్రము క్షమార్హం కాదని అన్నారు. విద్యుత్ శాఖ మంత్రిని కలిసి రాష్ట్రంలో విద్యుత్ కొరత గురించి చర్చించారా..? లేక ఉత్పత్తి దారులకోసం పైరవీలు చేస్తున్నారా..? తెలపాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజేపీ వామపక్ష ఉగ్రవాదం సాకుతో ప్రజాస్వామ్యవాదులపై అక్రమ కేసులు బనాయిస్తుందని మండిపడ్డారు. ఆ సమావేశంలో పాల్గొని జగన్ ఏమి చెప్పదల్చుకున్నారని నిలదీశారు. కృష్ణా జలాలపై సమీక్షల పేరుతో జలా లపై హక్కులు వదులుకోకూడదని అన్నారు. దీనిపై తక్షణమే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ద్రోహం తలపెట్టిన బిజేపీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమి ప్రయోజనం ఆశించి ఎన్డీఏతో ఎందుకు కొనసాగుతున్నారో ప్రజలకు చెప్పాలని కోరారు. బిజేపీ ధృతరాష్ట్ర కౌగిలిలో నలిగిపోతారో..? బయటకు వచ్చి స్వతంత్రంగా నిలబడతారో తెలుగుదేశం పార్టీ తేల్చుకోవాలని హితవు పలికారు. బిజేపీ అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను భూస్థాపితం చేసిన విషయం గుర్తుచేశారు. బిజేపీ అన్యాయాలపై ఒక్కమాట కూడా మాట్లాడక పోవటం హేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె.హరి కిషోర్, జిల్లా కార్యదర్శి టి.అరుణ్, రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బి.పవన్ లు పాల్గొన్నారు.