Sep 23,2023 10:07

ప్రజాశక్తి-ప్రకాశం : అమూల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకార డెయిరీ వ్యవస్థను నాశనం చేస్తున్నదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ప్రజా సమస్యలపై తలపెట్టిన సిపిఎం పోరుబాట పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతిష్టాత్మకమైన ప్రకాశం డైరీని గత ప్రభుత్వం మూత వేసిందని, ప్రస్తుత ప్రభుత్వం అమూల్ కంపెనీకి కట్టబెట్టి దాని ఊపిరి తీసారని ఆయన మండిపడ్డారు. కరువు కాటకాలతో అలమటిస్తున్న కాలంలో ఈ పాడి పరిశ్రమే ప్రకాశం జిల్లాను ఆదుకుందని అన్నారు. 70 ఎకరాల ప్రకాశం డైరీని రైతుల డబ్బులతో కొన్నారని, కానీ రైతులకు గాని, రైతు సంఘాలతో గాని, సొసైటీలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా డైరీని అమూల్ కు కట్టబెట్టిందని ఆగ్రహించారు. ఈ విధంగా చేయడం అన్యాయమని అన్నారు. గుజరాత్ ఉన్న మోడీ సంతృప్తి పరచడానికే ప్రకాశం డైరీని అమూల్ కు కట్టబెట్టారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజలు ప్రైవేటికరణ విధానాల వలన కలిగే నష్టాలను గ్రహించాలని కోరారు. లీటర్ పై అదనంగా రూ.4 బోనస్ ఇస్తానని గతంలో ప్రభుత్వ హామీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రైతులు వాటాదారులుగా ప్రకాశం డైరీని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.