- నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలిని రైతు సంఘం, కౌలు రైతు సంఘం డిమాండ్
- రైతు, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలో విస్తృత పర్యటన
ప్రజాశక్తి-చందర్లపాడు: చందర్లపాడు మండలంలో గత పది రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షాలకు చందర్లపాడు, కొడవటికల్లు, పొక్కునూరు, కాసరబాద, ఉస్తేపల్లి గ్రామాల్లో నీట మునిగిన మిర్చి, ప్రత్తి పంట పొలాలను సోమవారం రైతు, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో విస్తృతంగా పర్యటించి పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి వి ఆంజనేయులు మాట్లాడుతూ మండలంలో సుమారుగా ప్రత్తి రెండు వేల ఎకరాలు మిర్చి ఐదు వందల ఎకరాలకు పైగా పూర్తిగా దెబ్బతింది. బబ్బెళ్ళపాడు చెరువులో నుంచి వచ్చే వాగు కొడవటికల్లు వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.కృష్ణానది నుండి వచ్చిన వరద ఉధృతి వలన వాగు ఎగతాపు వేసి ఈ పొలం అంతా నీట మునిగి పాడైపోయింది. రైతులు ప్రత్తికి ఎకరానికి ముప్పై వేలు, మిర్చికి ఎకరానికి యాబై వేలకుక పైగా పెట్టుబడి పెట్టారు. కౌలు రైతులకు అదనంగా ఎకరానికి ఇరవై వేలు నష్టపోయారు. ప్రత్తి రైతులు ఆరుగాలం కష్టపడి ప్రత్తి చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాల వల్ల ప్రత్తి పంట నష్టపోయి రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ఈ పరిస్థితుల్లో వరద ముంపు వలన నష్టపోయిన రైతుల పంట పొలాలను సంబంధిత అధికారులతో ఇమ్యునరేషన్ చేయించి నష్టపోయినవారికి నష్టపరిహారం ఇప్పించాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం చందర్లపాడు ఎమ్మార్వో ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించి తాసిల్దార్ జె సుశీలదేవికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు చందర్లపాడుమండల కౌలు రైతు సంఘం అధ్యక్షులు గుమ్మళ్ళ ఏడుకొండలు, కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి సందిపొగు లింగయ్య, రైతు నాయకులు యర్రా శ్రీనివాసరావు, రైతులు రాయిడి వెంకటేశ్వరరావు, యార్లగడ్డ పెద్ద ప్రసాదు, రైతులు తదితరులు పాల్గొన్నారు.










