Apr 09,2022 15:43
  • తొలి సంతకం చేసిన ఏచూరి

ఇకె నయనార్‌ నగర్‌ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా సిపిఎం అఖిల భారత మహాసభలో శనివారం సంతకాల సేకరణ చేశారు. దీనికిముందు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికవర్గం నేతృత్వంలో ఏడాదికి పైగా సాగుతున్న పోరాటాన్ని సభలో వివరించారు. అనంతరం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని కోరుతూ రూపొందించిన వినతిపత్రంపై ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తొలి సంతకం చేశారు. అనంతరం మహాసభ ప్రతినిధులు అందరూ సంతకాలు చేశారు. ఈ వినతిపత్రాన్ని ప్రధాని నరేంద్రమోడీకి పంపనున్నారు.

  • విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు : సిహెచ్‌ నర్సింగరావు

విశాఖలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌ అంతటా 'విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు' అనే నినాదం మార్మోగుతోందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీకి అధ్యక్షత వహిస్తున్న ఆయన పార్టీ మహాసభలో సంతకాల సేకరణ సందర్భంగా మాట్లాడుతూ ... ప్రభుత్వ రంగంలోని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు కార్మికులు, ప్రజానీకం 14 నెలలుగా పోరాడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్లాంట్‌లో వంద శాతం వాటాను బహుళజాతి సంస్థ పోస్కోకు విక్రయించే ప్రయత్నానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఉద్యమిస్తోందన్నారు. విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని 1966లో జరిగిన పోరాటంలో 32 మంది ప్రాణాలర్పించారని తెలిపారు. వేలాది మంది విద్యార్థులు, యువకులు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. విశాఖ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు కార్మికులు కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. విక్రయాలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ప్లాంట్‌ను సందర్శించేందుకు ప్రయత్నించి విఫలమైందన్నారు. కార్మికుల పోరాటం విజయవంతం అవుతుందని నర్సింగరావు ఆశాభావం వ్యక్తం చేశారు.