Oct 09,2023 10:36
  •  బెడ్‌లు సరిపడా లేవు
  • వణికిస్తున్న వైరల్ ఫీవర్... గ్రామాల్లో కానరాని హెల్త్ క్యాంపులు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ :  గత కొద్ది రోజుల నుంచి వాతావరణంలో మార్పుల వల్ల కర్నూల్ జిల్లా ఆదోని మండలంలోని చాలా గ్రామాల్లో చిన్న, పెద్ద అని తేడా లేకుండా వైరల్ ఫీవర్ వణికిస్తున్నాయి. వాతావరణ సమతుల్యత వల్ల ఉదయం ఉక్కపోతతో చెమటతో శరీరం అంతా తడుస్తున్నదని చీకటి పడితే చల్లని గాలులు వీస్తున్నాయని, ఈ మార్పుల వల్లే జ్వరాలు వెంటాడుతున్నాయని తెలుస్తుంది. ఆదోని మండలంలో రోజురోజుకు వైరల్ ఫీవర్ లతోపాటు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి జరాలు అధికమవుతున్నాయి. మండలంలోని ఓ గ్రామంలో కుటుంబంలో కనీసం ఒకరికైనా జ్వరం వెంటాడుతుందని సమాచారం. వైరల్ ఫీవర్లతో ప్రజలు ప్రైవేట్ దవాఖానాలకు పరుగులు పెడుతున్నారు. విష జ్వరాల కారణంగా ప్రైవేట్ ఆస్పత్రులు రద్దీగా మారుతున్నాయి. కొందరు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు రకరకాల పరీక్షల పేరుతో అమాయక ప్రజల దగ్గర ఫీజులు దండుకుంటున్నారు. గ్రామాల్లో ఆర్ఎంపీ వైద్యులు,ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తే కమిషన్లు దండుకుంటున్నారని పలు గ్రామాల ప్రజలు అంటున్నారు. మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు సక్రమంగా వైద్యం అందడం లేదని పలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఆదోని ఏరియా ఆసుపత్రిలో;విష జ్వరాలతో జనం వణికిపోతున్నారు.ఏ ఇంట చూసినా జ్వరపీడితులే దర్శనమిస్తున్నారు. ఆదోని ప్రభుత్వ ఆస్పత్రి రోగులతో కిటకిట లాడుతోంది.గతంలో రోజూ 259వరకు ఓపీ వస్తుండగా వారం రోజులుగా 500 నుంచి 700వరకు నమోదవుతోంది. సోమవారం ఒక్క రోజే 280కి పైగా అవుట్‌ పేషెంట్‌లు ఆస్పత్రికి వచ్చారు.పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ఓపీ విభాగం వద్ద గంటల తరబడి నిరీక్షించవలసి వస్తోంది.ముఖ్యంగా గర్భిణులు నానా అవస్థలు పడుతున్నారు. వీరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఓపీ చీటీలను మాన్యువల్‌గా రాసి ఇవ్వవలసి వచ్చింది.

  • అన్ని వార్డులు కిటకిట

  జ్వరం, వాంతులు, విరేచనాలతో జనం ఆస్పత్రిలో చేరుతున్నారు.వార్డులన్నీ ఇన్‌పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. రోగుల రద్దీ కారణంగా కాన్పుల వార్డును సైతం ఇన్‌పేషెంట్ల కోస వినియోగిస్తున్నారు. అయినా బెడ్లు సరిపడా లేకపోవడంతో ఒక మంచంపై ఇద్దరు పేషెంట్లను ఉంచుతున్నారు. సోమవారం అన్ని వార్డుల్లో 60 మంది ఇన్‌పేషెంట్లు ఉన్నారు.బెడ్ల కొరతవల్ల వ్యాధి కొద్దిగా నయం కాగానే డిశ్చార్జ్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది.

  • రోగుల తాకిడి పెరిగింది : ఆదోని ఏరియా ఆసుపత్రి హెడ్‌ నర్సు

   విష జ్వరాల కారణంగా ఆస్పత్రికి రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నారు.బాధితుల్లో అధికంగా జ్వరపీడితులే ఉంటున్నారు. అస్పత్రిలోని అన్ని వార్డులు జ్వరపీడితులతో నిండిపోయాయి.బెడ్లు సరిపోవడం లేదు.రోగులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూస్తున్నాం. 

  • గత రెండు రోజులుగా ఓకే మంచంపై ఇద్దరు ఉన్నాం : రోజా, ఆదోని

    పాపకు జ్వరం వస్తే రెండు రోజుల క్రితం ఆదోని ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చాను. జ్వరం ఎక్కువగా ఉండడంతో వైద్యులు ఆ స్పత్రిలో చేర్చుకున్నారు. ప్రస్తుతం గ్లూకోజ్‌లు ఎక్కుతున్నాయి. బెడ్లు సరిపోను లేకపోవడంతో మా పాప మంచంపై మరో అ మ్మాయిని ఉంచి చికిత్స అందజేస్తున్నారు. వైద్యం మంచిగనే ఉంది.

  • గ్రామాలలో హెల్త్ క్యాంప్ ఏవి..?

   మండలంలోని ప్రజలు వైరల్ ఫీవర్ తో వెంటాడుతున్న మండలంలోని గ్రామాల్లో ఎక్కడ కూడా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.